మా ఓట‌మికి కార‌ణ‌మదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్‌ కెప్టెన్‌ | Pakistan Captain Fatima Sana Addresses Embarrassing Loss Against India In Womens World Cup | Sakshi
Sakshi News home page

మా ఓట‌మికి కార‌ణ‌మదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్‌ కెప్టెన్‌

Oct 6 2025 8:04 AM | Updated on Oct 6 2025 8:20 AM

Pakistan Captain Fatima Sana Addresses Embarrassing Loss Against India In Womens World Cup

ఐసీసీ మహిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో కొలంబో వేదిక‌గా ఆదివారం భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 88 ప‌రుగుల తేడాతో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. బౌలింగ్‌లో ప‌ర్వాలేద‌న్పించిన పాక్ జ‌ట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. 248 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్ జ‌ట్టు 43 ఓవ‌ర్ల‌లో 159 ర‌న్స్‌కే కుప్ప‌కూలింది.

యువ ఫాస్ట్ బౌల‌ర్ క్రాంతి గౌడ్‌, సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి పాక్ ప‌త‌నాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాట‌ర్ల‌లో సిద్రా అమిన్‌ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసింది.

అంత‌కుముందు భార‌త్ నిర్ణీత‌ 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్‌ డియోల్‌ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రిచా ఘోష్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. మ‌హిళ‌ల వ‌న్డేల్లో పాక్‌పై భార‌త్‌కు ఇది వ‌రుస‌గా 12వ విజ‌యం కావ‌డం విశేషం. అయితే ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం పాక్ కెప్టెన్ ఫాతిమా స‌నా స్పందించింది. ప్ర‌త్య‌ర్ధి భార‌త జ‌ట్టును త‌క్కువ ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యామ‌ని స‌నా చెప్పుకొచ్చింది.

"పవర్‌ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవ‌ర్ల‌లో మేము మెరుగ్గా బౌలింగ్ చేయ‌లేక‌పోయాము. నేను బౌలింగ్ చేసిన‌ప్పుడు బంతి స్వింగ్ అవుతున్న‌ట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్‌, స్వింగ్‌ మధ్య కాస్త కన్ఫూజన్‌కు గురైంది.

నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్‌లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్‌ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్‌ను మేము సులువుగా చేధించేవాళ్లం.

అయితే బ్యాటింగ్‌లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్‌లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెల​​కొల్పడం అవసరం. ఈ మ్యాచ్‌లో మేడు అది చేయలేకపోయాము. 

అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ ‍మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొంది. ఈ మ్యాచ్‌లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.
చదవండి: IND vs AUS: ఒక‌ప్పుడు కోహ్లితో క‌లిసి ఆడారు.. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్‌ల‌గా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement