
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు యాజమాన్యం. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడి ఫిట్‌నెస్ గురించి తమకు సమాచారం లేదని అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించాడు.
ఇందుకు షమీ ఘాటుగానే స్పందించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని.. ఫిట్‌నెస్ గురించి ఎవరూ అడగకపోయినా చెప్పడం సరికాదంటూ.. సెలక్టర్లు జట్టు ఎంపిక సమయంలో తనను సంప్రదించలేదని సంకేతాలు ఇచ్చాడు.
ఫిట్‌గా లేకపోవడం వల్లే
ఈ క్రమంలో షమీ వ్యాఖ్యలపై అగార్కర్ శుక్రవారం స్పందించాడు. ఎన్‌డీటీవీ వేదికగా మాట్లాడుతూ.. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే అలాంటి బౌలర్‌ను ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను.
ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయాం’ అని ఈ భారత మాజీ పేసర్ స్పష్టం చేశాడు. తాము ఆడిన రోజుల్లో సెలక్టర్లకు ఏనాడూ ఫోన్ చేయలేదని, ఇప్పుడు కాలం మారిందన్న అగార్కర్... జట్టుకు ఎంపిక కాని యువ ఆటగాళ్లు తనకు వెంటనే ఫోన్ చేస్తారని, వారికి వంద శాతం నిజాయితీగా తాను సమాధానం ఇస్తానని చెప్పాడు.
అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!
ఈ నేపథ్యంలో అగార్కర్‌కు షమీ మరోసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చిపడేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!’’ అంటూ అగార్కర్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.
కాగా షమీ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు కూల్చిన ఈ కుడిచేతి వాటం పేసర్.. వరుణ్ చక్రవర్తితో కలిసి భారత్ తరఫున సంయుక్తంగా లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ఈ సీజన్‌లో షమీ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 11.23 ఎకానమీతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, పనిభారం కారణంగా ఇంగ్లండ్‌తో టెస్టులకు షమీని ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించడం గమనార్హం.
దుమ్ములేపిన షమీ
ఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బౌలర్.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.
తద్వారా బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు షమీ. కాగా ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో భాగంగా బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
చదవండి: సెలక్షన్ విషయంలో ద్రవిడ్‌తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్