
భారత క్రికెట్ జట్టు యువ రక్తంతో నిండిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. టెస్టులకు రోహిత్ శర్మ (Rohit Sharma) స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని తప్పించింది.
ఇక ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ స్థానాన్ని యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భర్తీ చేశాడు. ఇప్పటికే టెస్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌ను 2-2తో సమం చేసిన గిల్.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేశాడు.
త్వరలోనే టీ20 పగ్గాలు కూడా అతడికే
ఈ క్రమంలో వన్డే సారథిగా తొలి ప్రయత్నంలోనే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గిల్‌కు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తున్నామని.. త్వరలోనే టీ20 పగ్గాలు గిల్‌కు అప్పగిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం పట్ల సంతోషంగా ఉంది. తను అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను.
కెప్టెన్సీ చేజారుతుందనే భయం
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం.
మనిషిగా, ఆటగాడిగా తను ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలుసు. తను ఈ స్థాయికి చేరడం పట్ల సంతోషంగా ఉంది. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా!’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అక్టోబరు 18- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆసియా కప్ విజేతగా
ఇందుకోసం గిల్ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోగా.. సూర్య సేన టీ20 సిరీస్‌కు ముందు అక్కడికి చేరుకుంటుంది. కాగా ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలే చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్