
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రీడా పరిపాలనలో అడుగుపెట్టనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకొని మూడేళ్లు కావొస్తుండగా... త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించడానికి ముందు వరకు ‘దాదా’...‘క్యాబ్’ అధ్యక్షుడిగా కొనసాగాడు. గంగూలీ పదవీ కాలం ముగిసిన అనంతరం రోజర్ బిన్నీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
‘గంగూలీ తిరిగి పాలకవర్గంలో అడుగుపెట్టనున్నాడు. క్యాబ్ అధ్యక్ష పదవికి అతడు పోటీ పడటం ఖాయమే. బీసీసీఐ నియమావళి అంగీకరిస్తే ఆ పదవికి గంగూలీ ఎన్నికవడం ఖాయమే. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలపై స్పష్టత రాదు’ అని బెంగాల్ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ‘క్యాబ్’ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆయన ఈ పదవిలో ఆరేళ్లుగా కొనసాగుతుండటంతో... లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. దీంతో గతంలో ‘క్యాబ్’ను సమర్థవంతంగా నడిపించిన గంగూలీ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.