
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root) ప్రశంసలు కురిపించాడు. సిరాజ్ మియాను నిజమైన పోరాట యోధుడిగా అభివర్ణించిన రూట్.. అతడి లాంటి ఆటగాడు ప్రతి జట్టులోనూ ఉండాలంటూ కొనియాడాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ‘నటించినా’.. నిజానికి సిరాజ్ చాలా మంచోడంటూ ప్రశంసించాడు.
4 వికెట్లా?.. 35 పరుగులా?
ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఇరుజట్ల మధ్య ఓవల్ టెస్టులో సోమవారం నాటి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో సిరీస్ ఫలితం తేలనుంది. టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంటే.. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగులు కావాలి.
ఇక భారత్ విధించిన 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం.. జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111). ఈ ఇద్దరు అద్భుతమైన సెంచరీలతో రాణించి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్.. సిరాజ్‌ను ఆకాశానికెత్తాడు.
అదంతా ఫేక్.. నిజానికి చాలా మంచోడు
‘‘అతడికి పట్టుదల ఎక్కువ. అతడొక యోధుడు. నిజమైన పోరాట యోధుడు. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీమిండియాను గెలిపించేందుకు సర్వస్వం ధారపోస్తాడు. అందుకు అతడిని తప్పక మెచ్చుకోవాల్సిందే.
ఆటగాడిగా అతడి దృక్పథం బాగుంటుంది. ఒక్కోసారి కోపం వచ్చినట్లు నటిస్తాడు. కానీ అంతలోనే కూల్ అయిపోతాడు. నిజానికి సిరాజ్ మంచివాడు. కాకపోతే తాను కాస్త కఠినంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడంతే!
అతడు గొప్ప నైపుణ్యాలున్న ఆటగాడు. అందుకే వరుసగా వికెట్లు తీస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడితో అతడితో తలపడటాన్ని నేను ఇష్టపడతాను. అతడి ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగదు.
అతడు ఏం చేసినా అది జట్టు కోసమే!.. యువ ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిదాయకం’’ అని రూట్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఇప్పటికే సిరాజ్ 20 వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే అత్యధికంగా వెయ్యి బంతులు వేశాడు కూడా!!
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు
👉వేదిక: కెన్నింగ్‌టన్ ఓవల్, లండన్
👉టాస్: ఇంగ్లండ్.. మొదట బౌలింగ్
👉తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 224
👉తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరు: 247
👉రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396
👉374 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 339/6 (76.2).
చదవండి: IND vs ENG: కామన్‌సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!
Mohammed Siraj lands a killer blow 💥
He sends the set English captain back to the pavilion 👋#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @mdsirajofficial pic.twitter.com/Okwai75KaA— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025