
ఓవల్ టెస్టు ఆఖరి రోజుకు చేరిన నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టులో ఆదివారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే నిలిపివేసి తప్పుచేశారని అంపైర్ల తీరును విమర్శించాడు. వర్షం తగ్గిన తర్వాత ఓ అరగంట సమయం ఇస్తే మ్యాచ్ ముగిసిపోయేదని అభిప్రాయపడ్డాడు.
శతక్కొట్టిన రూట్, బ్రూక్
ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో ఆఖరిదైన ఐదో టెస్టు లండన్‌లో ఓవల్ మైదానంలో గురువారం మొదలైంది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో 50/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (Harry Brook- 111) సెంచరీల కారణంగా పటిష్ట స్థితికి చేరిన ఇంగ్లండ్.. ఆట నిలిపివేసే సమయానికి విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలవాలంటే నాలుగు వికెట్లు అవసరం.
ఇదిలా ఉంటే.. వెలుతురు లేమి కారణంగా ఆదివారం ఆటను నిలిపివేసిన నిర్వాహకులు.. ఆ తర్వాత వర్షం కురవడంతో ఆటను ముగించివేశారు. ఈ నాటకీయ పరిణామాల నడుమ ఆట ఐదో రోజుకు చేరుకుంది.
కామన్‌సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు..
ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. ‘‘సోమవారం వర్కింగ్ డే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు డబ్బులు చెల్లించారన్న ముఖ్య విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాంటి అద్భుతమైన సిరీస్‌లో తుది ఫలితాన్ని నేరుగా వీక్షించేందుకు ప్రేక్షకులు అర్హులు.
అశేష అభిమానుల మధ్య.. చారిత్రాత్మక ది ఓవల్ మైదానంలో ఫలితం తేలితేనే సిరీస్ కూడా పరిపూర్ణం అవుతుంది. ఆదివారం రాత్రే ఇది జరిగి ఉండాల్సింది. ఇంగ్లండ్ మరో 35 పరుగులు చేసేదో.. లేదంటే గాయపడిన క్రిస్ వోక్స్ తిరిగి వచ్చి బ్యాటింగ్ చేసేవాడో తెలిసేది.
అరగంటలో ముగించేవారు!
కానీ వీళ్లేం చేశారు. ఆటను ఇలా ముగించివేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకో 42- 43 నిమిషాల పాటు ఆటను కొనసాగిస్తే ఫలితం తేలేది. నిబంధనల ప్రకారం.. కవర్లు తొలగించేందుకు వీలులేదని గ్రౌండ్స్‌మెన్ చెప్పేంత వరకు అంపైర్లు ఆటను ముగించరాదు.
అదనంగా ఇంకో అరగంట కేటాయించి ఉంటే ఏమయ్యేది? ఫలితం వస్తుందని అనిపించినప్పుడు ఇలా చేయడంలో తప్పేముంది? నాకైతే కామన్‌సెన్స్ లోపించినట్లు అనిపిస్తోంది. నిజంగా ఇది సిగ్గుచేటు’’ అంటూ మండిపడ్డాడు.
ఇక టీమిండియా మాజీ బ్యాటర్ దినేశ్ కార్తిక్ నాసిర్ హుసేన్‌కు మద్దతు పలికాడు. ఆఖరిదైన ఐదోరోజు ఆటను వీక్షించేందుకు కనీసం 20 వేల మంది ప్రేక్షకులు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్