
వానతో ఐదో టెస్టు ఫలితం నేటికి వాయిదా
నాటకీయ ముగింపునకు రంగం సిద్ధం
సిరీస్ విజయానికి ఇంగ్లండ్ 35 పరుగులు చేయాలి
సిరీస్ సమం చేసేందుకు భారత్ 4 వికెట్లు తీయాలి
‘శత’క్కొట్టిన బ్రూక్, రూట్
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది.
లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్ దక్కింది.
‘టాప్’ లేపడంతో ఉత్సాహం
తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్‌లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
బ్రూక్, రూట్ శతకాలు
నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్‌లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్‌లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339.
వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337.
బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0.