వైభ‌వ్ సూర్య‌వంశీపై వేటు.. క్లియ‌ర్‌గా చెప్పేసిన కెప్టెన్! | Shreyas Iyer confirms Vaibhav Sooryavanshis axing from West Indies T20Is | Sakshi
Sakshi News home page

IND vs WI: వైభ‌వ్ సూర్య‌వంశీపై వేటు.. క్లియ‌ర్‌గా చెప్పేసిన కెప్టెన్!

Oct 4 2026 4:59 PM | Updated on Oct 4 2026 5:39 PM

Shreyas Iyer confirms Vaibhav Sooryavanshis axing from West Indies T20Is

ఏషియ‌న్ గేమ్స్‌-2026 క్రికెట్ పోటీల్లో స్వ‌ర్ణం గెలుచుకున్న భార‌త పురుషుల జ‌ట్టు.. ఇప్పుడు స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ అక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కేది అనుమానంగానే మారింది.

ఆసియా క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, జట్టు కూర్పు కారణాల వల్ల వైభవ్‌ను మరోసారి బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్‌ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌‌లనే విండీస్‌తో సిరీస్‌లోనూ కొనసాగించనున్నట్లు సమాచారం.

గతనెలలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లోనూ వైభవ్ మూడు మ్యాచ్‌లకు గాను డ్రింక్స్ బాయ్‌గానే పరిమితమయ్యాడు. పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ అనంతరం జియో హాట్‌‌స్టార్‌తో మాట్లాడిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి.

"ప్రస్తుతం మేము ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఓపెనర్లతోనే ముందుకు వెళ్తున్నాం. వారు ఆ స్థానానికి పూర్తిగా అర్హులు. ప్రస్తుతం వైభవ్ 15 మంది సభ్యుల జట్టులోనే ఉన్నాడు కాబట్టి అతడికి భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు అతడు మైదానంలో ఖచ్చితంగా ఆధిపత్యం చెలాయిస్తాడనే నమ్మకం ఉంది" అని శ్రేయస్ వెల్లడించాడు.

వైభవ్‌తో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. "నేను వైభవ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాను. అందరూ అతనితో ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడుతుంటారు, కానీ నేను మైదానం వెలుపల అతడి జీవనశైలి, కుటుంబం, ఇతర విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తాను. 

అది అతనికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అతడు చూడటానికి చాలా సైలెంట్‌గా ఉంటాడు కానీ. మైదానంలో మాత్రం ప్రత్యర్థులపై విరుచుకుపడతాడు.  డ్రెసింగ్ రూమ్‌లో కూడా చాలా సరదాగా ఉంటాడు" అని అయ్యర్ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement