
సాయి సుదర్శన్ (PC: BCCI/X)
మాంచెస్టర్ టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బుధవారం నాటి ఆట ముగిసేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మొదటి రోజు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం రూపంలో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.
టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ-2025 (Tendulkar- Anderson Trophy)లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటికి ఏకంగా 462 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గాయపడిన పంత్
తద్వారా ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుల స్థానంలో పంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టు సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు గాయమైంది.
క్రిస్ వోక్స్ (Chris Woakes) సంధించిన బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడిపాదానికి తీవ్రమైన గాయమైంది. నొప్పి తట్టుకోలేక అతడు రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
పంత్ లేకపోకపోతే కష్టమే
ఈ విషయంపై పంత్ సహచర ఆటగాడు, టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ స్పందించాడు. పంత్ కోలుకోలేకపోతే తమకు ఎదురుదెబ్బ తప్పదని పేర్కొన్నాడు. అయితే, పంత్ లేకపోయినా మిగిలిన బ్యాటర్లు సత్తా చాటి జట్టును పటిష్ట స్థితిలో నిలపగలరని ధీమా వ్యక్తం చేశాడు.
తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని స్కాన్స్ కోసం పంపించారు. రాత్రికల్లా రిపోర్టులు వస్తాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే చాలా కష్టం. అతడు ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఒకవేళ గాయం తీవ్రతరమై తిరిగి బ్యాటింగ్‌కు రాకపోతే మాత్రం.. ఇందుకు సంబంధించిన పరిణామాలు మేము ఎదుర్కోకతప్పదు.
మరేం పర్లేదు.. మిగిలిన వాళ్లు చాలు
అయితే, జట్టులో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నవాళ్లు.. మిగిలిన ఆల్‌రౌండర్లు ఉన్నారు. కాబట్టి మా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతికూల పరిస్థితులు అధిగమిస్తాం. పంత్ లేనిలోటును పూడ్చేందుకు మా వాళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడాల్సి ఉంటుంది’’ అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు.
గెలిస్తేనే.. నిలుస్తారు
కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో భాగంగా 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియా.. మాంచెస్టర్‌లో గెలిస్తేనే గెలుపు అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముప్పై పరుగులే చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను రెండో టెస్టు నుంచి తప్పించారు.
తాజాగా నాలుగో టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సాయి.. 151 బంతులు ఎదుర్కొని 61 పరుగులతో అదరగొట్టాడు. కాగా తొలి రోజు ఆటలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) శుభారంభం అందించగా.. సాయి దానిని కొనసాగించాడు.
అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (12) మరోసారి విఫలం కావడం.. పంత్ 37 పరుగుల వద్ద మైదానం వీడటం ప్రభావం చూపాయి. ఆట పూర్తయ్యేసరికి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ చెరో పందొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో