
ఓ వైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సందిగ్ధం కొనసాగుతుండగా.. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం హిట్‌మ్యాన్ తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. గత ఐదు నెలలగా 50 ఓవర్ల క్రికెట్‌కు రోహిత్ దూరంగా ఉన్నప్పటికి తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్ధానానికి చేరుకున్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 5 రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 756 రేటింగ్ పాయింట్లతో బాబర్ ర్యాంక్‌ను ఆక్రమించాడు.
బాబర్ ఖాతాలో ప్రస్తుతం 751 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ అగ్రస్ధానంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 784 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. నాలుగో స్ధానంలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లి నిలిచాడు.
రోహిత్ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తరపున ఆడాడు. తన అద్బుతమైన నాయకత్వంతో భారత్‌కు ఏడో ఐసీసీ టైటిల్‌ను అందించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ ఐదు మ్యాచ్‌లు ఆడి 180 పరుగులు చేశాడు.
భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ నాలుగో స్ధానంలో నిలిచాడు. కానీ టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్-రేట్‌ను మాత్రం శర్మనే కలిగి ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో రోహిత్‌ను తిరిగి భారత జెర్సీలో చూసే అవకాశముంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా ఆడనున్నాడు. ఈ సిరీస్ తర్వాత రోకో ద్వయం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని వారిద్దరి స్దానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్‌గా గిల్‌ను నియమించాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ వారుసుడిగా భారత టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్.. తన తొలి సిరీస్‌లోనే ఆకట్టుకున్నాడు. గిల్ సారథ్యంలోని భారత జట్దు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
చదవండి: బాబర్ ఆజం వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా..