
రోహిత్ శర్మ (పాత ఫొటో)
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొత్త లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ కెరీర్‌ను మరికొంత కాలం పొడిగించుకునే క్రమంలో అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అనూహ్య రీతిలో ఏకంగా పది కిలోల బరువు తగ్గాడు. అంతటితో ఆగకుండా ఇంకొంత బరువు తగ్గడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. రోహిత్ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోను టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) విడుదల చేశాడు.
ఫొటో వైరల్
‘‘10000 గ్రాములు తగ్గిన తర్వాత... ఇంకా మేము దీనిని ప్రయత్నిస్తూనే ఉన్నాము’’ అంటూ రోహిత్‌తో ఉన్న ఫొటోను అభిషేక్ నాయర్ పంచుకోగా.. నెట్టింట వైరల్‌గా మారింది. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు చెప్పాడు.
ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేల్లో కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ... తదుపరి ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia) సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్టోబరులో జరిగే వన్డే సిరీస్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న హిట్‌మ్యాన్.. జిమ్‌లో చెమటోడుస్తున్నాడు.

లక్ష్యం దిశగా
అయితే, రోహిత్ త్వరలోనే వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్-2027 నేపథ్యంలో టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ చుట్టూ జట్టును నిర్మించే క్రమంలో.. బీసీసీఐ రోహిత్‌కు ఉద్వాసన పలకనుందని ఊహాగానాలు వెలువడాయి.
కానీ రోహిత్ శర్మ మాత్రం వన్డేల్లో తన కెరీర్‌ను మరికొంతకాలం పొడిగించుకోవాలని.. వరల్డ్‌కప్ వరకు కొనసాగాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ఈ ముంబై బ్యాటర్.. తన లక్ష్యం దిశగా పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
దిగ్గజ కెప్టెన్‌గా
కాగా రోహిత్ శర్మ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా టీమిండియాకు ఆడాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో భాగంగా 76 పరుగులతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత టీమిండియాకు అత్యధిక ఐసీసీ టైటిళ్లు (2) అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో ఉన్నాడు.

కోహ్లితో కలిసి
ఇక అక్టోబరులో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మతో పాటు టీమిండియా మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా పునరాగమనం చేయనున్నాడు. రోహిత్ మాదిరే కోహ్లి కూడా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
కాగా ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా టీమిండియా అక్టోబరు 19- 25 వరకు మూడు వన్డేలు, అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది.
చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!