
క్రికెట్ మైదానంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనలలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్‌కు బలయ్యాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది.
దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన హ్యూస్.. మూడు రోజుల తర్వాత అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే ఓ భారత క్రికెటర్ కూడా మైదానంలో బంతి తగిలి ప్రాణాలు విడిచారన్న విషయం మీకు తెలుసా? భారత ప్లేయర్ రమన్ లాంబా సైతం మైదానంలో క్రికెట్ ఆడుతూ మరణించాడు.
లాంబాకు ఏమైంది?
ఫిబ్రవరి 23, 1998న భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయస్సులో టీమిండియా కీలక ఆటగాడు రామన్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్‌లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు.
ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్‌లో ఉన్న లాంబాకు తాకి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి తాకిన వెంటనే గాయం అంత తీవ్రమైనదిగా అన్పించలేదు. అతడు ఫీల్డ్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతరంగా గాయం కావడంతో అతడు కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే అతడిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న అస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత పలు పరీక్షలు తర్వాత బంతి తలకు బలంగా తాకడంతో మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. అస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత లాంబా తుది శ్వాస విడిచారు. లాంబా భారత తరుపున 4 టెస్టులు, 32 వన్డేలు ఆడారు. మొత్తంగా ఆయన పేరిట 885 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి.
దేశవాళీ క్రికెట్‌లో అదుర్స్..
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో లాంబాకు అద్బుతమైన రికార్డు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన రమన్ లాంబా 1996-97 రంజీ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తంగా 87 మ్యాచ్‌లాడి 53.91 యావరేజితో 6362 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Asia Cup 2025: భారత స్టార్ ప్లేయర్‌కు ఊహించని షాక్.. శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్..!