
రచిన్- నికోల్స్ (PC: Blackcaps)
జింబాబ్వే పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పసికూనకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆతిథ్య జింబాబ్వే (ZIM vs NZ)ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్ టీమ్.. రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ఏకంగా 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
125 పరుగులకే ఆలౌట్
కాగా బులవాయో వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో 125 పరుగులకే కుప్పకూలింది.
జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రెండన్ టేలర్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ టఫాజ్వ త్సింగా (33 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన వారిలో నిక్ వెల్చ్ (11), సీన్ విలియమ్స్ (11) మాత్రమే పది పరుగుల స్కోరు దాటాడు.
కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మాథ్యూ ఫిషర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
కాన్వే, రచిన్, నికోల్స్ భారీ శతకాలు
ఓపెనర్లలో డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153) శతక్కొట్టగా.. విల్ యంగ్ (Will Young) హాఫ్ సెంచరీ (74)తో రాణించాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన బౌలర్ జేకబ్ డఫీ మాత్రం 36 పరుగులే చేయగలిగాడు. అయితే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
రచిన్ కేవలం 139 బంతుల్లోనే 165 పరుగులతో అజేయంగా ఉండగా.. నికోల్స్ 245 బంతుల్లో 150 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 130 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే కంటే తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ప్రపంచంలోనే తొలి జట్టుగా
కాన్వే, నికోల్స్, రచిన్‌ల భారీ సెంచరీల కారణంగానే ఇది సాధ్యమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. విదేశీ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు 150కి పైగా వ్యక్తిగత స్కోర్లు సాధించడం ఇదే తొలిసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా కివీస్ అవతరించింది.
ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఇంగ్లండ్ (1938లో ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా మీద మూడు 150+ స్కోర్లు), టీమిండియా (శ్రీలంక మీద కాన్పూర్‌లో మూడు 150+ స్కోర్లు) న్యూజిలాండ్ కంటే ముందు వరుసలో ఉన్నాయి.