
పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) అరుదైన ఘనత సాధించాడు. తక్కువ వన్డేల్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును షాహిన్ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం నాటి తొలి వన్డేలో భాగంగా అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు.
వన్డే సిరీస్‌లోనూ శుభారంభం
కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత పొట్టి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రిజ్వాన్ బృందం.. వెస్టిండీస్‌ను 280 పరుగులకు ఆలౌట్ చేసింది. బ్రాండన్ కింగ్ (4), షాయీ హోప్ (55), రొమారియో షెఫర్డ్ (4) రూపంలో మూడు కీలక వికెట్లతో పాటు.. షమార్ జోసెఫ్ (8) వికెట్‌ను కూడా షాహిన్ ఆఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని షాహిన్ శాసించాడు. అతడికి తోడుగా నసీం షా (Naseem Shah) కూడా మూడు వికెట్లతో చెలరేగాడు. మిగిలిన వారిలో సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీమ్, సల్మాన్ ఆఘా ఒక్కో వికెట్ పడగొట్టారు.
నవాజ్ ధనాధన్
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 48.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి 284 పరుగులు సాధించింది. తద్వారా విండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం (47) రాణించగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (53) అర్ధ శతకంతో మెరిశాడు.
ఇక వన్డే అరంగేట్ర బ్యాటర్ హసన్ నవాజ్ (54 బంతుల్లో 63), హుసేన్ తలత్ (37 బంతుల్లో 41) ధనాధన్ దంచికొట్టాడు. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్ గెలుపును ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే.. తన అంతర్జాతీయ కెరీర్‌లో షాహిన్ ఆఫ్రిదికి ఇది 65వ వన్డే. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా ఈ లెఫ్టార్మ్ పేసర్.. వన్డేల్లో 131 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో రషీద్ ఖాన్‌ను దాటేసి.. 65 వన్డేల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహిన్ రికార్డులకెక్కాడు. అంతకు ముందు రషీద్ 65 వన్డేల్లో కలిపి 128 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రషీద్ ఖాన్ ఇప్పటికి 114 వన్డేలు పూర్తి చేసుకుని 199 వికెట్లు సాధించాడు.
వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే సంక్షిప్త స్కోర్లు
👉వెస్టిండీస్: 280 (49)
👉పాకిస్తాన్: 284/5 (48.5)
👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై పాకిస్తాన్ విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హసన్ నవాజ్.
చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్