‘తప్పులు సరిదిద్దుకుంటా’ | Prasidh Krishna focuses on lower order batting | Sakshi
Sakshi News home page

‘తప్పులు సరిదిద్దుకుంటా’

Jun 29 2025 3:36 AM | Updated on Jun 29 2025 3:36 AM

Prasidh Krishna focuses on lower order batting

లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌పై దృష్టి 

పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ వ్యాఖ్య  

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ పరాజయానికి ప్రధాన కారణాల్లో బుమ్రా మినహా ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన. ముఖ్యంగా పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ అయితే ఏకంగా ఓవర్‌కు ఆరుకు పైగా రన్‌రేట్‌తో పరుగులిచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 15 ఓవర్లకు పైగా వేసిన సందర్భాల్లో చూస్తే టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఏ ఒక్క బౌలర్‌ కూడా బంతులకు మించి పరుగులివ్వలేదు. ఇలాంటి చెత్త రికార్డును సొంతం చేసుకున్న ప్రసిధ్‌ తన తప్పుల నుంచి నేర్చుకుంటానని, తర్వాతి టెస్టుల్లో మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శన కనబరుస్తానని అతను అన్నాడు. 

రెండో టెస్టు సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్‌లో పాల్గొన్న అనంతరం శనివారం ప్రసిధ్‌ మీడియాతో మాట్లాడాడు. ‘నా ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా. నేను అనుకున్న లెంగ్త్‌ల ప్రకారం బౌలింగ్‌ చేయలేకపోయాను. పరిస్థితులకు తగినట్లుగా అర్థం చేసుకుంటూ నా బౌలింగ్‌ను మార్చుకోలేకపోయా. అక్కడే తప్పు జరిగింది. వాటిని సరిదిద్దుకొని వచ్చే సారి మంచి ఫలితాలు రాబడతా’ అని ప్రసిధ్‌ చెప్పాడు. తాను వేసిన కొన్ని మంచి బంతులు బ్యాటర్‌ ఎడ్జ్‌ తీసుకొని దూసుకుపోయాయని, ఆ విషయంలో అదృష్టం కలిసి రాలేదన్న భారత పేసర్‌...బౌన్సర్లు ప్రయత్నించినప్పుడు కూడా చాలా పరుగులు రావడం నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. 

తొలి టెస్టులో ఓటమినుంచి జట్టు కోలుకుందని, డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉందని ప్రసిధ్‌ పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌లో వ్యూహాలపై తన సహచర బౌలర్లతో చర్చిస్తున్నట్లు అతను వెల్లడించాడు. తొలి టెస్టులో మన లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ ఘోరంగా విఫలమైంది. దీనిని కూడా తాము మెరుగుపర్చుకునే పనిలో ఉన్నామని భారత పేసర్‌ వివరించాడు. ‘నెట్‌ సెషన్‌లో మా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లంతా చాలా కష్టపడ్డాం. క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలిచి పరుగులు జోడించే ప్రయత్నంలో తీవ్రంగా శ్రమిస్తున్నాం. వాటి విలువ గత మ్యాచ్‌లో తెలిసింది. అందుకే బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాం’ అని ఈ కర్నాటక పేస్‌ బౌలర్‌ స్పష్టం చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement