భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుని అభినందించారు. తన నివాసంలో హర్మన్ సేనతో ప్రధాని సమావేశమై.. వరల్డ్‌కప్ విశేషాలను చర్చించారు. కాగా నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.
సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టైటిల్‌ను మన అమ్మాయిలు గెలుచుకున్నారు. నవీ ముంబై వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా అవతరించారు. ఈ క్రమంలో హర్మన్ సేనపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. తన కార్యాలయంలో వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని కార్యాలయం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు బుధవారం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ జగజ్జేతలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా వన్డే వరల్డ్‌కప్ విజేతలు.. తమ సంతకాలతో కూడిన ‘నమో’ జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు.
హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినా.. ఒత్తిడిని అధిగమించారంటూ భారత జట్టును ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని.. ఈ సందర్భంగా మోదీ హర్మన్ సేనకు పిలుపునిచ్చారు.
ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్‌గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయాలని.. పాఠశాలకు వెళ్లి మరీ పిల్లలకు ఇవన్నీ బోధించాలని మోదీ.. భారత జట్టుకు సూచించారు. ఇక ప్రధాని మోదీతో మాట్లాడుతున్న క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. 2017 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని గుర్తు చేసుకోగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన .. ఆ సమయంలో ప్రధాని మోదీ తమలో స్ఫూర్తి నింపారని తెలిపింది.
చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు


