ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశారు. కంగారూ జట్టుతో మూడు వన్డేల్లో రో‘హిట్’ కాగా.. కోహ్లి మాత్రం తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఆసీస్ టూర్‌కు ముందు
అయితే, మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (121)తో చెలరేగగా.. కోహ్లి భారీ అర్ధ శతకం (73)తో మెరిశాడు. ఇలా హిట్‌మ్యాన్ శతక్కొట్టడం.. కోహ్లి ఫామ్‌లోకి రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి రో- కో జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడాల్సి రావొచ్చని ఆసీస్ టూర్‌కు ముందు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ జట్టుతో వన్డే సిరీస్ సందర్భంగా రో- కో త్వరలోనే మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
నవంబరు 13, 16 19 తేదీల్లో
ఇక అంతకంటే ముందు భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు అనధికారిక టెస్టు సిరీస్‌తో పాటు.. అనధికారిక వన్డే సిరీస్‌లోనూ పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి అనధికారిక టెస్టు ముగియగా.. రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు మ్యాచ్ గెలిచింది.
ఈ క్రమంలోనే టెస్టుల తర్వాత నవంబరు 13, 16 19 తేదీల్లో భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్లు అనధికారిక వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మూడూ డే- నైట్ మ్యాచ్‌లే. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కూడా భారత్- ‘ఎ’ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా జట్టును ప్రకటించింది.
భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు
ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా... రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల పేర్లు లేవు. దీంతో రో-కో ఆటను మరోసారి చూడాలన్న అభిమానుల ఆశలకు గండిపడినట్లయింది. ఇదిలా ఉంటే.. వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టుకు సారథి కాగా.. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.
అదే విధంగా.. ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా స్టార్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఇందులో భాగం కానున్నారు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలకు భారత్- ‘ఎ’ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా


