నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ వృథా | West Indies Beat New Zealand by 7 Runs in 1st T20, Take 1-0 Lead in Series | Sakshi
Sakshi News home page

నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ వృథా

Nov 5 2025 5:27 PM | Updated on Nov 5 2025 6:36 PM

NZ Vs WI 1st T20: West Indies Beat New Zealand By 7 Runs Lead Series

న్యూజిలాండ్‌ పర్యటనను వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్‌పై విండీస్‌ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం (West Indies Beat New Zealand) సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్‌.. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం ఆక్లాండ్‌లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈడెన్‌ పార్క్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు
దీంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (3), అలిక్‌ అథనాజ్‌ (16) విఫలమైనా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాయీ హోప్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న హోప్‌ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రోస్టన్‌ చేజ్‌ (28), రోవ్‌మన్‌ పావెల్‌ (23 బంతుల్లో 33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కివీస్‌ బౌలర్లలో జేకబ్‌ డఫీ, జకారీ ఫౌల్క్స్‌ రెండేసి వికెట్లు తీయగా.. కైలీ జెమీషన్‌, జేమ్స్‌ నీషమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇక విండీస్‌ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు టిమ్‌ రాబిన్సన్‌ (27), డెవాన్‌ కాన్వే (13) ప్రభావం చూపలేకపోయారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర (21) నిరాశపరచగా.. మార్క్‌ చాప్‌మన్‌ (7), డారిల్‌ మిచెల్‌ (13), మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (1), జేమ్స్‌ నీషమ్‌ (11) పూర్తిగా విఫలమయ్యారు.

సాంట్నర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ వృథా
ఇలాంటి దశలో కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది.. 55 పరుగులు సాధించిన సాంట్నర్‌ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 

అయితే, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన కివీస్‌.. 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా విండీస్‌ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోస్టన్‌ ఛేజ్‌ చెరో మూడు వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో మాథ్యూ ఫోర్డ్‌, రొమారియో షెఫర్డ్‌, అకీల్‌ హొసేన్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య గురువారం (నవంబరు 6) ఇదే వేదికపై రెండో టీ20 నిర్వహణకై ముహూర్తం ఖరారైంది.

చదవండి: అందుకే అర్ష్‌దీప్‌ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement