మోర్నీ మోర్కెల్ (PC: BCCI)
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)కు మొండిచేయే ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వందకు పైగా వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న అర్ష్‌కు.. యాజమాన్యం తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.
అర్ష్‌దీప్‌ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)కు ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) హర్షిత్ కోసం అర్ష్‌ను బలిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
సత్తా చాటిన అర్ష్
ఈ నేపథ్యంలో ఆసీస్ (IND vs AUS)తో జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు అర్ష్‌ను యాజమాన్యం ఆడించింది. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 35 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్.. ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (11), మార్కస్ స్టొయినిస్ (64) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

ఇక భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్‌లలో అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది.
అతడు వరల్డ్‌క్లాస్ బౌలర్.. అర్థం చేసుకున్నాడు
ఇందుకు బదులిస్తూ.. ‘‘అర్ష్‌దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్. మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసుకున్నాడు.
అతడు వరల్డ్‌క్లాస్ బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీని వల్ల కొంత మంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు.
అయితే, సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు. ఇందుకు గల కారణాలు మాత్రం వారు అర్థం చేసుకోగలరు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సంసిద్ధం చేస్తున్నాం.
కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు
ఒత్తిడిలోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలపై మాకు ఎటువంటి సందేహాలు లేవు. అయితే, కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు’’ అని 41 ఏళ్ల మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి


