క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.

ఇటీవలే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్‌ను కొనసాగించాలని ఆశిద్దాం.
కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.

విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.
ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్‌ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్‌నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్‌నెస్‌ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.

అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్‌నెస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.
కెరీర్‌ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్‌ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.
ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్‌ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు.
ఫిట్‌నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.

కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్‌కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్‌కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం.
కోహ్లి సాధించిన ఘనతలు..
అండర్-19 వరల్డ్‌కప్ (2008)
వన్డే వరల్డ్‌కప్ (2011)
టీ20 వరల్డ్‌కప్ (2024)
ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)
ఐపీఎల్ (2025)
ఆసియా కప్-3
టెస్ట్ మేస్-5
ఐసీసీ అవార్డ్స్-10
చదవండి: డ్రగ్స్‌కు బానిస.. స్టార్ క్రికెటర్‌పై శాశ్వత నిషేధం


