జింబాబ్వే క్రికెట్‌కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది. ఇకపై అతని సెంట్రల్ క్రాంటాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది.
సీన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు. కారణం ఏంటని బోర్డు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది.
అప్పటికే హెవీగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సీన్.. డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది. అలవాటు నుంచి బయటపడేందుకు డీఎడిక్షన్ సెంటర్‌లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది.
39 ఏళ్ల సీన్ జింబాబ్వేకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. కెరీర్‌లో 18 టెస్ట్‌లు, 162 వన్డేలు, 8 టీ20లు ఆడి 13 సెంచరీలు, 50 సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా అయిన సీన్.. మూడు ఫార్మాట్లలో 156 వికెట్లు తీశాడు.
కాగా, సీన్ డుమ్మా కొట్టిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వేకు అత్యంత కీలకంగా ఉండింది. ఆ టోర్నీలో జింబాబ్వే సికందర్ రజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాబ్వే విజయావకాశాలను ప్రభావితం చేసేదే. ఒకవేళ ఆ టోర్నీలో జింబాబ్వే ఓటమిపాలై, ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయుంటే జింబాబ్వే అభిమానులు సైతం సీన్‌ను క్షమించేవారు కాదు.
జింబాబ్వే క్రికెట్‌కు మాదకద్రవ్యాల ముప్పు
జింబాబ్వే క్రికెట్‌లో మాదకద్రవ్యాల కలకలం ఇది మొదటిసారి కాదు. 2022లో మరో మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ కోకైన్ వాడకం వల్ల మ్యాచ్ ఫిక్సర్ల చేతిలో బ్లాక్‌మెయిల్‌కు గురయ్యాడు. ఆ ఉదంతంలో ఫిక్సర్ల నుంచి డబ్బు తీసుకున్న టేలర్‌పై 3.5 ఏళ్ల నిషేధం విధించబడింది.
టేలర్ ఇటీవల శిక్షను పూర్తి చేసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. టేలర్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సీన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది.


