నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి యాషెస్ (Ashes Series 2025-26) టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు.
ఈ జట్టులో ఎవరూ ఊహించని ఓ ఆటగాడికి (జేక్ వెదరాల్డ్, Jake Weatherald) చోటు దక్కింది. ఇటీవల దేశవాలీ క్రికెట్‌లో సెంచరీల మోత మోగించిన మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) తిరిగి జట్టులోకి వచ్చాడు. వెదరాల్డ్, లబూషేన్‌లలో ఎవరో ఒకరు ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఓపెనింగ్ చేస్తారు.

పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా కెమెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్ చోటు దక్కించుకున్నారు. కమిన్స్ గైర్హాజరీలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్ బ్యాకప్ బౌలర్లుగా జట్టులోకి వచ్చారు. అలెక్స్ క్యారీ రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా, జోస్ ఇంగ్లిస్ రిజర్వ్ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యారు. పేలవ ఫామ్ కారణంగా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ జట్టులో స్థానంలో కోల్పోయాడు. మ్యాట్ రెన్‌షా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతనికి నిరాశే మిగిలింది.
పేసర్లుగా జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియాన్ కొనసాగుతున్నారు.
యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్
మరోవైపు యాషెస్ సిరీస్ మొత్తానికి బెన్ స్టోక్స్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు.
యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్


