మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా (Pakistan vs South Africa) జట్ల మధ్య నిన్న (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో హైడ్రామా చోటు చేసుకుంది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ సాధించినట్టే సాధించి మిస్ అయ్యాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 44వ ఓవర్ తొలి రెండు బంతులకు అబ్రార్.. బ్రీట్జ్కే, ఫోర్టుయిన్‌ను ఔట్ చేశాడు. మూడో బంతికి లుంగి ఎంగిడి ఎల్బీడబ్ల్యూ అయినట్లు తొలుత ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు.
దీంతో అబ్రార్, అతని సహచరులు సహా మైదానంలో ఉన్న పాక్ అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. అయితే ఎంగిడి అంపైర్ నిర్ణయంపై రివ్యూకి వెళ్లడంతో కథ తారుమారైంది. రివ్యూలో స్పష్టంగా ఇన్‌సైడ్ ఎడ్జ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. చేతిలోకి వచ్చిన హ్యాట్రిక్ మిస్ కావడంతో అబ్రార్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ మ్యాచ్‌లో పాక్ సౌతాఫ్రికాను ఓడించి సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 8 వికెట్లు కోల్పోయి, మరో 2 బంతులు మిగిలుండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది.
పాక్ గెలుపులో సల్మాన్ అఘా (62), మొహమ్మద్ రిజ్వాన్ (55), ఫకర్ జమాన్ (45), సైమ్ అయూబ్ (39, 2 వికెట్లు) కీలక పాత్రలు పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లు పాక్‌ను భయపెట్టారు. ఎంగిడి, ఫెరియెరా, కార్బిన్ బాష్ తలో 2, లిండే, ఫోర్టుయిన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు నసీం షా (9.1-1-40-3), అబ్రార్ అహ్మద్ (9-1-53-3), సైమ్ అయూబ్ (8-0-39-2), షాహీన్ అఫ్రిది (10-0-55-1), మొహమ్మద్ నవాజ్ (10-0-45-1) ధాటికి సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ప్రిటోరియస్ (57), డికాక్ (63) అర్ద సెంచరీలతో రాణించారు.
కెప్టెన్ బ్రీట్జ్కే (42), కార్బిన్ బాష్ (41) పర్వాలేదనిపించారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే కూడా ఫైసలాబాద్ వేదికగానే నవంబర్ 6న జరుగుతుంది.
చదవండి: ఆసియాకప్‌లో ఓవరాక్షన్.. పాక్ ఆటగాడిపై 2 మ్యాచ్‌ల బ్యాన్! సూర్యకు కూడా


