అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (151 బంతుల్లో 85; 8 ఫోర్లు), విల్ జాక్స్(47), బ్రైడన్ కార్స్(39), జేమీ స్మిత్(60) పోరాడినప్పటికి తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించ లేకపోయారు. రికార్డు లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ బెన్ డకెట్ (4) అవుట్ కాగా... కాసేపటికే ఒలీ పోప్ (17) కూడా వెనుదిరిగాడు.
పోరాటానికి మారుపేరైన జో రూట్ (63 బంతుల్లో 39; 5 ఫోర్లు) కీలక దశలో వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లు ఆసీస్ సారథి కమిన్స్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే బ్రూక్ (56 బంతుల్లో 30; 2 ఫోర్లు) అండతో క్రాలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 177/3తో పటిష్టంగా కనిపించింది. ఇలాంటి దశలో ఆసీస్ స్పిన్నర్ లయన్ ఆ జట్టును దెబ్బ తీశాడు.
స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆ్రస్టేలియా వైపు తిప్పాడు. బ్రూక్, స్టోక్స్ (18 బంతుల్లో 5; 1 ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే క్రాలీ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 194/6తో కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో సహచరుల నుంచి పెద్దగా సహకారం దక్కకపోయినా మొండిగా పోరాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ సారి అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయాడు.
అయితే జేమీ స్మిత్, విల్ జాక్స్ నిలకడగా ఆడి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రెకెత్తించారు. స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కార్స్ కూడా ఆకట్టుకున్నాడు. కానీ జాక్స్ ఔటయ్యాక ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కార్స్ నాటౌట్‌గా నిలవగా.. ఆర్చర్, టంగ్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియోన్ తలా మూడేసి వికెట్లు పడగొట్టాడు.
హెడ్ భారీ సెంచరీ
అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... అలెక్స్ కేరీ (128 బంతుల్లో 72; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు పెద్దగా తోడ్పాటు అందించలేకపోవడంతో ఆసీస్ జట్టు ఆశించిన స్కోరు కంటే ముందే ఆలౌటైంది.
జోష్ ఇన్‌గ్లిస్ (10), కెపె్టన్ ప్యాట్ కమిన్స్(6) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో అటు బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... బ్రైడన్ కార్స్3 వికెట్లు తీశాడు.


