గిల్‌కు భారీ షాక్‌.. వరల్డ్‌ కప్‌ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌ | India squad for T20 World Cup 2026: Shubman Gill dropped as vice-captain, Ishan Kishan makes comeback | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: గిల్‌కు భారీ షాక్‌.. వరల్డ్‌ కప్‌ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌

Dec 20 2025 2:16 PM | Updated on Dec 20 2025 3:46 PM

India squad for T20 World Cup 2026: Shubman Gill dropped as vice-captain, Ishan Kishan makes comeback

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో గిల్‌కు చోటు ద‌క్క‌లేదు. అత‌డి స్ధానంలో తిరిగి ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ను వైస్ కెప్టెన్‌గా  బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ నియ‌మించింది.

ఈ ఏడాది ఆసియాక‌ప్‌తో తిరిగి టీ20 జ‌ట్టులోకి వ‌చ్చిన గిల్ ఏమాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా గిల్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలి మూడు మ్యాచ్‌ల‌లో ఘోరంగా విఫలమైన గిల్‌ను ఆఖరి రెండు టీ20లకు గాయం పేరిట టీమ్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. 

దీంతో అతడి స్దానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇక‌పై సంజూను ఓపెన‌ర్‌గా కొన‌సాగించాల‌ని మెనెజ్‌మెంట్ నిర్ణ‌యించారు. ఈ కార‌ణంతోనే గిల్‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టు నుంచి ప‌క్క‌న పెట్టారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ సైతం ధ్రువీక‌రించాడు. గిల్ పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, గ‌త టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కూడా అత‌డు ఆడ‌లేద‌ని అగార్క‌ర్ వెల్ల‌డించాడు.

కిషన్‌కు ఛాన్స్‌..!
ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ రెండేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కిషన్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకుంది. అయితే నిన్నటి వరకు టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితీష్‌ శర్మపై సెలక్టర్లు వేటు వేశారు. 

అతడి స్ధానంలోనే సెకెండ్‌ వికెట్‌ కీపర్‌గా కిషన్‌ను సెలక్ట్‌ చేశారు. అదేవిధంగా సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న ఫినిషర్‌ రింకూ సింగ్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే వరల్డ్‌కప్‌ టోర్నీకి ఎంపిక చేశారు. ఇదే జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది.

కిషన్‌ చివరగా భారత్‌ తరపున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత జట్టు 
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా,  ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రింకూ సింగ్‌.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement