వెక్కిరించిన పాక్‌ బౌలర్‌.. ఇచ్చిపడేసిన హసరంగ | Asia Cup 2025: Abrar Ahmed Mocks Hasaranga, Sri Lankan Star Hits Back with Celebration | Sakshi
Sakshi News home page

వెక్కిరించిన పాక్‌ బౌలర్‌.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ

Sep 24 2025 9:07 AM | Updated on Sep 24 2025 10:59 AM

Pakistan Abrar Taunts Hasaranga With Send Off Sri Lanka Star Perfect Reply

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గట్టెక్కింది. సూపర్‌-4లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్‌ అవకాశాలు సజీవం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (Abrar Ahmed) అతి చేశాడు.

వెక్కిరించిన పాక్‌ బౌలర్‌
శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ (Wanindu Hasaranga)ను అవుట్‌ చేసిన తర్వాత.. హసరంగను అనుకరిస్తూ అతడి శైలిలోనే సెలబ్రేట్‌ చేసుకుని.. ఏవో మాటలు అన్నాడు. ఇందుకు సహచర ఆటగాళ్లు కూడా వంత పాడారు. శ్రీలంక ఇన్నింగ్స్‌ పదమూడో ఓవర్‌ తొలి బంతికి ఈ ఘటన జరిగింది.

టాపార్డర్‌ విఫలమైన వేళ కమిందు మెండిస్‌ అర్ధ శతకం (50)తో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హసరంగ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు బాది 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. అబ్రార్‌ అహ్మద్‌ హసరంగను బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలోనే అతడిని వెక్కిరించినట్లుగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ
అయితే, వనిందు హసరంగ ఇందుకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. పాక్‌ లక్ష్య ఛేదనకు దిగినపుడు.. మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో.. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (17) క్యాచ్‌ అందుకున్న హసరంగ.. అబ్రార్‌ మాదిరి గాల్లోకి జంప్‌ కొడుతూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. 

తర్వాత సయీమ్‌ ఆయుబ్‌ (2), కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (5) రూపంలో కీలక వికెట్లు తీసి మరోసారి అబ్రార్‌ను అనుకరిస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, మ్యాచ్‌ తర్వాత అబ్రార్‌ హసరంగకు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.

ఫైనల్‌ ఆశలు సజీవం
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌..లంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో అసలంక బృందం నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది.

పాక్‌ బౌలర్లలో షాహిన్‌ ఆఫ్రిది మూడు, హ్యారీస్‌ రవూఫ్‌, హుసేన్‌ తలట్‌ రెండేసి వికెట్లు తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌కు ఒక వికెట్‌ దక్కింది. లక్ష్య ఛేదనలో పాక్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా (24), హుసేన్‌ తలట్‌ (32 నాటౌట్‌), మొహమ్మద్‌ నవాజ్‌ (38 నాటౌట్‌) రాణించడంతో పాక్‌ 18 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి.. ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

చదవండి: పాయింట్‌ తేడాతో గట్టెక్కిన టైటాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement