
ప్రొ కబడ్డీ లీగ్‌లో ఐదో విజయం
జైపూర్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో నిలకడగా రాణిస్తున్న తెలుగు టైటాన్స్ ఐదో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాయింట్ తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గట్టెక్కింది. తెలుగు టైటాన్స్ 30–29తో గుజరాత్‌ను ఓడించింది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ రాణించాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 9 పాయింట్లు సాధించాడు. కెప్టెన్ విజయ్ మలిక్ (7) కూడా రాణించడంతో తెలుగు జట్టు క్రమం తప్పకుండా స్కోరు చేసింది. డిఫెండర్లలో శుభమ్ షిండే (4), అంకిత్ (3) ఆకట్టుకున్నారు.
గుజరాత్ జట్టులో మొహమ్మద్ రెజా (6) అదరగొట్టాడు. ఇతనికి ఆర్యవర్ధన్ (4), విశ్వంత్ (3), అంకిత్ దహియా (3), లక్కీ శర్మ (2), రోహిత్ నందల్ (2) సమష్టిగా సహకరించారు. అనంతరం జరిగిన హోరాహోరీ పోరులో జైపూర్ పింక్‌పాంథర్స్ టైబ్రేక్‌లో యు ముంబాపై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 38–38 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్ నిర్వహించగా జైపూర్ 6–4తో యు ముంబాపై పైచేయి సాధించింది. పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ (14) అదరగొట్టాడు.
20 సార్లు కూతకెళ్లిన 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మిర్‌బగేరి (4), ఆశిష్ కుమార్ (3) మెరుగ్గా ఆడారు. యు ముంబా జట్టులోనూ రెయిడర్ సందీప్ (14) ప్రత్యర్థి జట్టుకు దీటుగా రాణించాడు. కూతకెళ్లిన ప్రతీసారి జైపూర్ ఆటగాళ్లను వణికించాడు. డిఫెండర్లలో లోకేశ్ (4), అనిల్ (3), పర్వేశ్ (2), రింకూ (2) ఉమ్మడిగా పాయింట్లు సాధించారు. నేడు విశ్రాంతి రోజు కాగా... గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధాస్, దబంగ్ ఢిల్లీతో యు ముంబా తలపడతాయి.