
నవాజ్
5 వికెట్లతో శ్రీలంకపై గెలుపు
ఫైనల్ అవకాశాలు సజీవం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో పాకిస్తాన్‌కు కీలక విజయం దక్కింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు ఫైనల్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పోరులో పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
కమిందు మెండిస్ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. మొహమ్మద్ నవాజ్ (24 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హుస్సేన్ తలత్ (30 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో పాక్‌ను గెలిపించారు. సూపర్–4 దశలో వరుసగా రెండో ఓటమితో లంక ఫైనల్ అవకాశాలకు తెర పడినట్లే!
ఇన్నింగ్స్ రెండో బంతికి కుశాల్ మెండిస్ (0)ను అవుట్ చేసిన షాహిన్ అఫ్రిది తన తర్వాతి ఓవర్లో నిసాంక (8)ను కూడా వెనక్కి పంపాడు. కుశాల్ పెరీరా (15)ను రవూఫ్ అవుట్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53/3కి చేరింది. ఎనిమిదో ఓవర్లో తలత్ వరుస బంతుల్లో అసలంక (20), షనక (0)లను డగౌట్ చేర్చగా, కొద్ది సేపటికే హసరంగ (15) కూడా అవుట్ కావడంతో లంక 80/6 వద్ద నిలిచింది. ఈ దశలో కమిందు, చమిక కరుణరత్నే (17 నాటౌట్) కలిసి ఏడో వికెట్‌కు 39 బంతుల్లో 43 పరుగులు జోడించారు.
పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తలత్, రవూఫ్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో పాక్‌కు సరైన ఆరంభం లభించింది. ఫర్హాన్ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఫఖర్ జమాన్ (17) తొలి వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. 12 పరుగుల వ్యవధిలో పాక్ 4 వికెట్లు కోల్పోయింది. తీక్షణ ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను వెనక్కి పంపించగా...
హసరంగ తన వరుస ఓవర్లలో అయూబ్ (2), సల్మాన్ (5)లను అవుట్ చేశాడు. హారిస్ (13) కూడా నిలవలేకపోయాడు. ఈ దశలో పాక్ ఓటమి దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే తలత్, నవాజ్ కలిసి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరు 41 బంతుల్లో అభేద్యంగా 58 పరుగులు జోడించారు.