పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు (Babar Azam) భారీ షాక్ తగిలింది. నవంబర్ 16న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మితిమీరి ప్రవర్తించినందుకు ఐసీసీ అతడికి జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో బాబర్ ఔటయ్యాక వికెట్లను బ్యాట్‌తో తన్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇలాంటి చర్య లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది.
దీని ఫలితం బాబర్ డిసిప్లినరీ రికార్డుకు ఓ డీ మెరిట్ పాయింట్ యాడ్ చేయబడింది. అలాగే ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫీజ్‌లో 10 శాతం కోత విధించబడింది. గడిచిన 24 నెలల కాలంలో బాబర్ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో ఐసీసీ నామమాత్రపు చర్యలతో వదిలిపెట్టింది. ఐసీసీ చర్యలను బాబర్ కూడా అంగీకరించాడు. దీంతో విచారణ నుంచి మినహాయింపు పొందాడు.
ఆ మ్యాచ్‌కు ముందే బాబర్ తన సుదీర్ఘ సెంచరీ కలను నెరవేర్చుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 807 రోజులు, 83 మ్యాచ్‌ల తర్వాత బాబర్ సాధించిన తొలి సెంచరీ ఇదే. ఈ మత్తులో ఉండగానే ఐసీసీ బాబర్‌కు షాకిచ్చింది.
కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది.
సదీరా సమరవిక్రమ (65 బంతుల్లో 48; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (34), పవన్ రత్నాయకే (32), కామిల్ మిశారా (29), పతుమ్ నిసాంక (24) పర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ వసీమ్ (3/47) లంకను దెబ్బ తీయగా...హారిస్ రవూఫ్, ఫైసల్ అక్రమ్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొహమ్మద్ రిజ్వాన్ (92 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు), ఫఖర్ జమాన్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించి పాక్‌ను గెలిపించారు. హుస్సేన్ తలత్ (42 నాటౌట్), బాబర్ ఆజమ్ (34) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.
ఈ సిరీస్ తర్వాత పాక్ సొంతగడ్డపైనే శ్రీలంక, జింబాబ్వేతో కలిపి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడనున్నాయి.
చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది?


