
జింబాబ్వే పర్యటనను న్యూజిలాండ్ అద్బుతమైన విజయంతో ముగించింది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జింబాబ్వేను ఇన్నింగ్స్ అండ్ 359 పరుగుల తేడాతో కివీస్ చిత్తు చేసింది. టెస్టుల్లో పరుగుల పరంగా న్యూజిలాండ్ ఇదే అతి పెద్ద విజయం. అంతేకాకుండా ఈ భారీ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0 తేడాతో వైట్‌వాష్ చేసింది.
నిప్పులు చెరిగిన హెన్రీ
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ మాట్ హెన్రి 5 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రెండన్ టేలర్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ టఫాజ్వ త్సింగా (33 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
ముగ్గురు మొనగాళ్లు..
అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 601/3 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153) ,హెన్రీ నికోల్స్(150 నాటౌట్),రచిన్ రవీంద్ర(165 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరి ముగ్గురుతో పాటు విల్ యంగ్(74) పరుగులతో రాణించాడు.
దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు జింబాబ్వే కంటే 476 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జింబాబ్వే 117 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ 5 వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, డఫీ తలా రెండేసి వికెట్లు సాధించారు.
మూడో జట్టుగా..
కాగా ఈ విజయంతో న్యూజిలాండ్ మరో రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించిన మూడో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1958లో ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. తాజా గెలుపుతో విండీస్‌ను కివీస్ అధిగమించింది. కాగా అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ అగ్రస్ధానంలో ఉంది. 1938లో 579 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఇంగ్లీష్ జట్టు ఓడించింది.
చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై బ్యాన్!?