
కాన్వే, నికోల్స్, రచిన్ భారీ సెంచరీలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 601/3
476 పరుగుల ఆధిక్యం
జింబాబ్వేతో రెండో టెస్టు
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు సెంచరీలతో విజృంభించారు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 174/1తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... చివరకు 130 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 601 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153; 18 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (245 బంతుల్లో 150 బ్యాటింగ్; 15 ఫోర్లు), రచిన్ రవీంద్ర (139 బంతుల్లో 165 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో కదంతొక్కారు.
నైట్‌వాచ్‌మన్ జాకబ్ డఫీ (36; 6 ఫోర్లు) త్వరగానే అవుట్ కాగా... కాన్వే, నికోల్స్ మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కాన్వే 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు వరకు టెస్టు మ్యాచ్ తరహాలో సాగిన పోరును... రచిన్ వన్డేలాగా మార్చేశాడు. ధనాధన్ షాట్లతో రెచ్చిపోతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో నికోల్స్ కాస్త నిధానంగా ఆడగా... రచిన్ మాత్రం జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నాడు.
నికోల్స్ 166 బంతుల్లో మూడంకెల స్కోరుకు చేరగా... రవీంద్ర చూస్తుండగానే 104 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ జంట ఆఖరి సెషన్ చివరి గంటలో చెలరేగిపోయింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. సెంచరీ నుంచి 150కి చేరేందుకు రవీంద్ర 29 బంతులు మాత్రమే తీసుకున్నాడంటే అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
రచిన్, నికోల్స్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 256 పరుగులు జోడించారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, ట్రేవర్, మసెకెసా తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌట్ కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ 476 పరుగుల ఆధిక్యంలో ఉంది.