43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71 నాటౌట్
గుజరాత్‌పై ముంబై ఘనవిజయం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై నెగ్గింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన గుజరాత్‌కు లీగ్‌లో తొలి పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హమ్ (33 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.
బెత్ మూనీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), కనిక (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారతి (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆఖర్లో మెరిపించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దంచికొట్టిన సోఫీ డివైన్ (8) ఈసారి విఫలమైంది. జార్జియా, భారతి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 24 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఈ జోడీ చివరి రెండు ఓవర్లలో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు రాబట్టడం విశేషం.
ముంబై బౌలర్లలో షబ్నమ్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... అమన్‌జ్యోత్ కౌర్ (26 బంతుల్లో 40; 7 ఫోర్లు), నికోలా కేరీ (23 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) ఆమెకు అండగా నిలిచారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో రేణుక, కాశ్వీ, సోఫీ డివైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కెప్టెన్ ఇన్నింగ్స్
భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ముంబై జట్టు అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్లు కమలిని (13), హేలీ మాథ్యూస్ (22) ఎక్కువసేపు నిలవలేకపోయినా... హర్మన్ జట్టును ముందుండి నడిపించింది. అమన్‌జ్యోత్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 బంతుల్లో 72 పరుగులు... నాలుగో వికెట్‌కు నికోలాతో 43 బంతుల్లోనే 84 పరుగులు జత చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరి ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి జట్టును గెలిపించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కాగా... ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ లీగ్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది.
స్కోరు వివరాలు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి అండ్ బి) కెర్ 33; సోఫీ డివైన్ (సి) కమిలిని (బి) షబ్నిమ్ 8; కనిక (సి) నికోలా (బి) హేలీ 35; గార్డ్‌నర్ (ఎల్బీ) (బి) నికోలా 20; జార్జియా (నాటౌట్) 43; ఆయుషి (రిటైర్డ్ అవుట్) 11; భారతి (నాటౌట్) 36; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు)192. వికెట్ల పతనం: 1–22, 2–64, 3–97, 4–99, 5–136.
బౌలింగ్: షబ్నమ్ 4–0–25–1; హేలీ మాథ్యూస్ 3–0–34–1; నికోలా కేరీ 4–0–36–1; అమెలియా కెర్ 4–0–40–1; అమన్‌జ్యోత్ కౌర్ 4–0–48–0; సంస్కృతి 1–0–5–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: కమలిని (స్టంప్డ్) మూనీ (బి) రేణుక 13; హేలీ (సి) డివైన్ (బి) కాశ్వి 22; అమన్‌జ్యోత్ (సి) గార్డ్‌నర్ (బి) డివైన్ 40; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 71; నికోలా కేరీ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–20, 2–37, 3–109. బౌలింగ్: రేణుక 4–0–39–1; కాశ్వి 4–0–33–1; రాజేశ్వరి 2–0–22–0; సోఫీ డివైన్ 3.2–0–29–1; జార్జియా 2–0–23–0; తనూజ 3–0–29–0, గార్డ్‌నర్ 1–0–10–0.


