
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. పదహారేళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్న దిగ్గజ ఆటగాడికి.. కేవలం ఇంకొక్క ఏడాదైనా సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏముందని.. రోహిత్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరు సరికాదని మండిపడ్డాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందే బీసీసీఐ వన్డే కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌ను గెలిపించిన రోహిత్‌ను తప్పించి.. టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది. ఈ నేపథ్యంలో కైఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
గొప్పతనాన్ని చాటుకున్నాడు
‘‘టీమిండియా కోసం రోహిత్ శర్మ తన జీవితంలో ఇప్పటికే పదహారేళ్లు ఇచ్చాడు. అతడి కోసం ఒక్కటంటే ఇంకొక్క ఏడాదే కెప్టెన్‌గా సమయం ఇవ్వలేరా?.. ఐసీసీ ఈవెంట్లలో పదహారు మ్యాచ్‌లలో పదిహేను మ్యాచ్‌లను గెలిపించిన సారథి. వన్డే వరల్డ్‌కప్-2023లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. 2024లో టీ20 ప్రపంచకప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.
కొందరు పట్టుకుని వేలాడతారు.. రోహిత్ అలా చేయలేదు
‘మేము ప్రపంచకప్ గెలిచాం. కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు రావాలి’ అని తనే తప్పుకొన్నాడు. కొన్నాళ్లు లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నాడు. నిజానికి భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా చాలామంది తమ కాలాన్ని పొడిగించుకునేందుకు, పదవిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు.
కానీ రోహిత్ శర్మ అలా చేయలేదు కదా!.. తను వాళ్ల లాంటి వాడు కాదు.. అయినా ఇలా ఎందుకు?.. నిజానికి రోహిత్ ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. వారికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అయినా సరే అతడిని ఇంకొక్క ఏడాది కెప్టెన్‌గా కొనసాగించలేరా?
ఇంత హడావుడిగా ఎందుకు?
వన్డే వరల్డ్‌కప్-2027 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకు ఇంకా సమయం ఉంది. అయితే, ఇప్పటికే రోహిత్‌ను తొలగించారు. శుబ్‌మన్ గిల్ కొత్త సారథిగా వచ్చాడు. గిల్ ఇంకా యువకుడే. ఇప్పుడే హడావుడిగా అతడికి వన్డే కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరమైతే నాకు కనిపించలేదు’’ అంటూ కైఫ్ బీసీసీఐ తీరును విమర్శించాడు.
చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం