
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటువేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా ఎంపిక చేసింది.
ఆసీస్‌తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్ సందర్భంగా గిల్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కూడా స్పందించాడు.
త్వరలోనే అతడూ అవుట్
రోహిత్ శర్మపై వేటు వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 నేపథ్యంలో బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంది.
ఇటీవలే అతడు టీమిండియాను ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో సూర్య డిప్యూటీగా, వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించాడు. అంటే.. త్వరలోనే అతడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండబోతున్నాడని ముందుగానే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి గిల్ చుట్టూ జట్టును నిర్మించే క్రమంలో బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని అభిప్రాయపడ్డాడు.
అందుకే ఈ నిర్ణయం
’కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్‌కు ముందే తెలియజేశాం. 2027 వన్డే వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉన్నా సహజంగానే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు వన్డే జరుగుతున్న తీరు చూస్తే వచ్చే రెండేళ్లలో ఎక్కువగా మ్యాచ్‌లు లేకపోవచ్చు.
కాబట్టి కెప్టెన్ జట్టు గురించి తెలుసుకునేందుకు, తన ప్రణాళికలు రూపొందించుకునేందుకు తగినంత సమయం కావాలి. అందుకే గిల్‌ను ఎంపిక చేశాం. నిజంగా చెప్పాలంటే మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం కూడా కష్టమే.
కెప్టెన్‌గా రోహిత్ చాలా అద్భుతంగా నడిపించాడు. ఒక వేళ చాంపియన్స్ ట్రోఫీ గెలవకపోయినా అది అతని గొప్పతనాన్ని తగ్గించదు. కానీ ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత అయినా ఏదో ఒక దశలో టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే’ అని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే.