మహారాజా టీ20 ట్రోఫీ 2026లో కర్ణాటక వెటరన్ బ్యాటర్, గుల్బర్గ మిస్టిక్స్ సారధి మనీశ్ పాండే చెలరేగిపోయాడు. కోస్టల్ కింగ్స్ మంగళూరు జట్టుపై విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగుల చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు 177 పరుగులు చేసింది.
గుల్బర్గ ఇన్నింగ్స్‌లో మనీశ్ మినహా ఎవరూ రాణించలేదు. ప్రకార్ ఛతుర్వేది (25), తిప్పా రెడ్డి (25), ధృవ్ ప్రభాకర్ (22) 20కి పైగా స్కోర్లు చేశారు. మంగళూరు బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ 3 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కోదండ అజిత్ కార్తీక్ తలో 2, సంతోక్ సింగ్ ఓ వికెట్ తీశారు.
అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగళూరు టీమ్.. ఓపెనర్ నికిన్ జోస్ (47 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టుడు, కెప్టెన్ కరుణ్ నాయర్ (56) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
గుల్బర్గాకు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి నుంచి రెండో స్థానంలో (5) నిలిచింది.
ఐపీఎల్ 2026లో పాండే ప్రదర్శన
ఐపీఎల్ 2026లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన పాండేకు సీజన్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. చివరి దశలో జట్టులో స్థానం దక్కించుకున్న అతడు. ఆరు మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ముంబై ఇండియన్స్‌పై అతడు ఆడిన 45 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
ఈ సీజన్‌లో పాండే ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్‌ను నమ్మశక్యంకాని రీతిలో అందుకొని అందరి మన్ననలు పొందాడు. ఈ క్యాచ్‌ను సీజన్‌లోనే ఉత్తమ క్యాచ్‌గా ఎంపిక చేశారు.


