1.2 బిలియన్ యూరోలుగా సంస్థ విలువ
ఏడాది ఆఖరు నాటికి డీల్ పూర్తి
ప్రస్తుత మేనేజ్‌మెంట్ కొనసాగింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్‌కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్‌కి తెరతీసింది. అంతర్జాతీయ వైద్యసేవల దిగ్గజం మెడికవర్ ఏబీకి చెందిన భారత విభాగం మెడికవర్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ ఎంతనేది కేకేఆర్ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ.. సంస్థ విలువను 1.2 బిలియన్ యూరోలుగా (దాదాపు రూ. 13,200 కోట్లు) లెక్కగట్టినట్లు న్యాయ సలహాలందిస్తున్న ట్రైలీగల్ వివరించింది.
కేకేఆర్‌కి చెందిన ఫండ్స్‌కి 100 శాతం వాటాలను విక్రయించేందుకు తమతో పాటు మైనారిటీ వాటాదారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడికవర్ తెలిపింది. దీనితో స్థూలంగా 740 మిలియన్ యూరోలు లభిస్తాయని, ఆ మొత్తంతో పోలాండ్ తదితర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు పేర్కొంది.
ఈ డీల్‌కి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో జాన్ స్టబింగ్‌టన్ చెప్పారు. మరోవైపు ప్రస్తుత మేనేజ్‌మెంటే మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని మెడికవర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు. సంస్థలో 14 వేల మంది ఉద్యోగులు, 1,900 మంది పైగా డాక్టర్లు ఉన్నారని, వారు కూడా యథాప్రకారంగానే కొనసాగుతారని పేర్కొన్నారు.
సంస్థను మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఏడాది ఆఖరు నాటికి ఇది పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో సుమారు 11–12 లక్షల మంది పేషంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు, ‘మరింత నాణ్యమైన వైద్య సేవలందించడంలో మెడికవర్ ఇండియా డాక్టర్లు, ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా అధునాతన హెల్త్‌కేర్ సరీ్వసులను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయి‘ అని కేకేఆర్ పార్ట్‌నర్ అక్షయ్ తనా తెలిపారు.
నాలుగు రాష్ట్రాల్లో 24 ఆస్పత్రుల నెట్‌వర్క్..
మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ చెయిన్ ఆపరేటర్, హైదరాబాద్‌కి చెందిన సహృదయ హెల్త్‌కేర్‌లో నియంత్రణాధికారాలుండే వాటాలను కొనుగోలు చేయడం ద్వారా స్వీడన్‌కి చెందిన మెడికవర్ 2017లో భారత హెల్త్‌కేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. మెడికవర్ ఇండియాలో మెడికవర్ హోల్డింగ్స్ బీవీకి 67 శాతం ఉండగా, మైనారిటీ షేర్‌హోల్డర్లయిన ప్రస్తుత సీఎండీ జి. అనిల్ కృష్ణ తదితరుల వద్ద సుమారు 33 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో పి. హరికృష్ణ, ఎ. శరత్ రెడ్డి ఈడీలుగా, ఏఆర్ కృష్ణప్రసాద్ డైరెక్టరుగా ఉన్నారు. సుమారు 4,800 పడకలతో 24 ఆస్పత్రుల నెట్‌వర్క్ ఉంది. 80 పైచిలుకు స్పెషాలిటీల్లో సేవలు అందిస్తోంది.
భారీ విస్తరణ బాటలో కేకేఆర్
కేకేఆర్ 2004 నుంచి అంతర్జాతీయంగా హెల్త్‌కేర్ విభాగంలో సుమారు 20 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. గత కొన్నాళ్లుగా భారత్‌లోనూ విస్తరించింది. మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో భారీ లాభాలకు నిష్క్రమించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత 2025లో కేరళకు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బీఎంహెచ్)లో దాదాపు రూ. 2,500 కోట్లకు సుమారు 70 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ హెల్త్‌కేర్ విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దక్షిణాది మరింతగా కార్యకలాపాలు విస్తరించింది. మైత్రా హాస్పిటల్, చళికట్టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌లో నియంత్రణాధికారాలున్న వాటాలను దక్కించుకుంది. ఈ విభాగంలో ఫైనాన్సింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది.


