
భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్‌బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో (13-15) కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.
మెస్సీకి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్‌కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్‌బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్‌బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
కోల్‌కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో (విజ్‌క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్‌లో పర్యటించాడు. నాడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు.