వైభవ్ సూర్యవంశీ (PC: SLC)
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ అవకాశాలు సన్నగిల్లిన వేళ అఫ్గానిస్తాన్- ‘ఎ’ను చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.
ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్. దంబుల్లాలో ఆదివారం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. దురదృష్టవశాత్తూ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
అయితే, జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు.. గత మ్యాచ్‌లో తనను కవ్వించిన శ్రీలంక ఆటగాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు వైభవ్. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల ఈ పిల్లాడిపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వైభవ్ విషయంలో ఎవరైనా జోక్ చేయాలనుకుంటే వారికి అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తూ ఉంటాడు.
శ్రీలంక ప్లేయర్లు గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో వైభవ్ పరుగులు చేయకపోవడంపై జోకులు వేశారు. భారీగా సంబరాలు చేసుకున్నారు. వారికి కూడా వైభవ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు.
‘యువ ఆటగాళ్లు.. ముఖ్యంగా పదిహేనేళ్ల పిల్లాడితో పెట్టుకుంటే.. ఏం జరిగిందో చూశారు కదా!.. కాబట్టి ఇకపై నోరు మూసుకుని ఉంటే మంచిది’ అనే సందేశాన్ని ఇచ్చాడు. వైభవ్ ఇన్నింగ్స్ వల్లే ఇండియా మ్యాచ్ గెలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో వైభవ్ దంచికొట్టకుంటే ఇండియా కచ్చితంగా ఓడిపోయేదే.
నిజంగా అతడు దేవుడి బిడ్డ. వైభవ్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో శ్రీలంక ప్లేయర్లకు బాగా తెలిసి వచ్చింది. నిజానికి ఆరోజు వైభవ్‌ను రెచ్చగొట్టకపోయి ఉంటే బహుశా వాళ్లకు ఫైనల్లో గెలుపు అవకాశాలు ఉండేవేమో!
ఇది ఐపీఎల్ కాదు! అంటూ అతడిని ఏడిపిస్తారా? బదులుగా అతడు మీ బౌలింగ్ విభాగాన్ని చితక్కొట్టాడు’’ అంటూ చిక్కా వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు. కాగా శ్రీలంకతో ఫైనల్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో శ్రీలం 311 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 66 పరుగుల తేడాతో గెలుపొందిన తిలక్ వర్మ సేన.. సిరీస్‌ను సొంతం చేసుకుంది.


