
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మఫాకా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 19 ఏళ్ల మఫాకా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబెలెత్తించాడు. టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, జంపాలను యువ సంచలనం పెవిలియన్‌కు పంపాడు.
మఫాకా మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే 4 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో సఫారీ స్పీడ్ స్టార్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి ప్లేయర్‌గా..
అంతర్జాతీయ టీ20ల్లో పూర్తి సభ్య దేశాల(టెస్టు హోదా కలిగిన జట్లు) నుంచి నాలుగు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా మఫాకా చరిత్ర సృష్టించాడు. మఫాకా కేవలం 19 సంవత్సరాల 124 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ వేన్ పార్నెల్ పేరిట ఉండేది. పార్నెల్ 2009లో వెస్టిండీస్‌పై 19 సంవత్సరాల 318 రోజుల వయస్సులో ఫోర్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో పార్నెల్ ఆల్‌టైమ్ రికార్డును మఫాకా బ్రేక్ చేశాడు.
అదేవిధంగా టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సఫారీ బౌలర్‌గా కూడా మఫాకా నిలిచాడు. ఇంతకుముందు రికార్డు కైల్ అబాట్, తహీర్, వైస్ పేరిట ఉండేది. వీరిముగ్గురూ కూడా ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని మఫాకా అధిగమించాడు. కాగా తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.
చదవండి: ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే: సౌరవ్ గంగూలీ