కాబోయే భార్యతో ఫోటోలు పోస్ట్‌ చేసి, వెంటనే డిలీట్‌ చేసిన కుల్దీప్‌ యాదవ్‌.. ఏం జరిగింది..? | Kuldeep Yadav Shares Photos With Fiancee Vanshika, Later Removes It | Sakshi
Sakshi News home page

కాబోయే భార్యతో ఫోటోలు పోస్ట్‌ చేసి, వెంటనే డిలీట్‌ చేసిన కుల్దీప్‌ యాదవ్‌.. ఏం జరిగింది..?

Jun 17 2025 8:33 AM | Updated on Jun 17 2025 9:53 AM

Kuldeep Yadav Shares Photos With Fiancee Vanshika, Later Removes It

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఇటీవలే (జూన్‌ 4న) తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్‌-వ​న్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. 

కాన్పూర్‌లోని శ్యామ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్‌-వన్షిక ఎంగేజ్‌మెంట్‌కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ హాజరయ్యారు. వివాహా తేదీని త్వరలో ప్రకటిస్తామని కుల్దీప్‌ చెప్పాడు.

కాగా, కుల్దీప్‌-వన్షిక నిశ్చితార్ధం జరిగి రెండు వారాలు కూడా గడవకముందే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సోషల్‌మీడియాలో పుకార్లు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతం ఈ పుకార్లకు బలం చేకూరుస్తుంది. కుల్దీప్‌ వన్షికతో కలిసి దిగిన ఫోటోలను నిన్న తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసి వెంటనే డిలీట్‌ చేశాడు. 

కుల్దీప్‌ ఇలా చేయడంపై క్రికెట్‌ ఫాలోవర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. కుల్దీప్‌-వన్షిక బంధం పెళ్లి వరకు కూడా సాగేలా లేదని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్‌ ఒక్కడే స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్‌ టీమిండియాకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కుల్దీప్‌ ఇంగ్లండ్‌ గడ్డపై ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. 

అందులోనూ అతను కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేశాడు. ఇంగ్లిష్‌ కండీషన్స్‌పై పెద్ద అవగాహన లేని కుల్దీప్‌ ఏమేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత స్పిన్‌ విభాగం బరువును కుల్దీప్‌తో పాటు రవీంద్ర జడేజా మోయనున్నాడు. 

అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఈ ఇద్దరు భారత్‌ స్పిన్‌ విభాగానికి పెద్ద దిక్కుగా మారారు. అక్షర్‌ పటేల్‌ రూపంలో భారత్‌కు మరో స్పిన్‌ ఆప్షన్‌ ఉన్నా ఈ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నా అతనికి తుది జట్టులో అవకాశం దొరకడం అనుమానమే. జూన్‌ 20 నుంచి హెడింగ్లేలో తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement