'అనుకోకుండా వచ్చాడు.. అతడి కెరీర్‌ను ముగించాడు' | Kris Srikkanth's brutal remark after IND vs WI 2026 1st T20I | Sakshi
Sakshi News home page

IND vs WI: 'అనుకోకుండా వచ్చాడు.. అతడి కెరీర్‌ను ముగించాడు'

Oct 7 2026 2:21 PM | Updated on Oct 7 2026 2:37 PM

Kris Srikkanth's brutal remark after IND vs WI 2026 1st T20I

పంజాబ్ ఆల్‌రౌండ‌ర్ న‌మ‌న్ ధీర్ టీమిండియా త‌ర‌పున త‌న అంత‌ర్జాతీయ టీ20 కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు.  మంగ‌ళ‌వారం ల‌క్నో వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20లో న‌మ‌న్ ధీర్ అద‌ర‌గొట్టాడు. బ్యాటింగ్‌లో అవ‌కాశం రానిప్ప‌టికి బౌలింగ్‌లో మాత్రం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల‌లో కోటాలో 31 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఈ ప్రదర్శనతో టీ20 అరంగేట్రంలో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోద చేసిన మూడో బౌలర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో నమన్ ధీర్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. నమన్ ఒక అద్భుతమైన ఆటగాడని, అతడి రాకతో వాషింగ్టన్ సుందర్ వైట్-బాల్  కెరీర్ ముగిసినట్లేనని శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అనుకోకుండా వచ్చి
వాస్తవానికి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన మొదట జట్టులో నమన్ ధీర్‌కు చోటు దక్కలేదు. అయితే, వాషింగ్టన్ సుందర్‌ను రెడ్-బాల్ క్రికెట్ ప్రాక్టీస్ కోసం రంజీ ట్రోఫీ ఆడేందుకు బీసీసీఐ రిలీజ్ చేయడంతో నమన్‌కు అనుహ్యంగా జట్టు నుంచి పిలుపునొచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న నమన్, తన ప్రదర్శనతో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

సుందర్ ఇక టెస్టులే ఆడుకోవాలి!
తన యూట్యూబ్ ఛానెల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ... "సుందర్ స్థానంలో అనుకోకుండా వచ్చిన నమన్ ధీర్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లోనూ రాణించిన నమన్‌ను ఇకపై తుది జట్టు నుంచి పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయలేరు. దీంతో వాషింగ్టన్ సుందర్ పరిమిత ఓవర్ల కెరీర్ ముగిసినట్లే. అతడు ఇక టెస్టు క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలి" అని పేర్కొన్నాడు.

సుందర్ ఫిట్‌నెస్ సమస్యలను ప్రస్తావిస్తూ... "సుందర్ ప్రతి రెండు మ్యాచ్‌ల తర్వాత ఏదో ఒక గాయం బారిన పడుతుంటాడు. ఇప్పుడు అతడి స్థానంలో సరైన ఆల్‌రౌండర్ దొరికాడు. నమన్ ధీర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు బ్యాటర్ మైండ్‌సెట్‌ను ముందే పసిగడతాడు. తాను వేగంగా వేసినప్పుడు బంతి సిక్సర్ వైపు వెళ్తే వెంటనే అలర్ట్ అయి వేగాన్ని తగ్గించి తెలివిగా బౌలింగ్ చేస్తాడు. టీ20 క్రికెట్‌కు అతడు సరిగ్గా సరిపోతాడు" అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌.. ఆసీస్‌ పేసర్‌ సరికొత్త చరిత్ర! 39 ఏళ్ల తర్వాత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement