అహ్మదాబాద్ వేదికగా భారత్ అండర్-19తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్ ఓటమి పాలైంది. కంగారులు నిర్ధేశించిన 11 పరుగల స్వల్ప లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది. అంతకుముందు ఆసీస్ యువ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌లో విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి కేవలం 151 పరుగులకే కుప్పకూలింది.
తొలి ఇన్నింగ్స్‌లో కూడా 174 పరుగులకు ఆసీస్ ఆలౌటైంది. భారత్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు పేసర్ స్పెన్సర్ గ్రీన్ మాత్రం ఓ అరుదైన రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
39 ఏళ్ల తర్వాత
స్పెన్సర్ గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 28 ఓవర్లలో 110 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా యూత్ టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో ప్లేయర్‌గా గ్రీన్ నిలిచాడు. ఇంతకుముందు 1987లో జరిగిన ఓ యూత్ టెస్ట్ మ్యాచ్‌లో స్కాట్ ప్రెస్ట్‌విడ్జ్ 30 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు.
మళ్లీ 39 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను గ్రీన్ నమోదు చేశాడు. కాగా భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా సైతం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.


