పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత్-ఎ జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి 2-1 తేడాతో టీమిండియా తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌటైంది.
సూర్యాన్ష్ షెడ్గే 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విప్రజ్ నిగమ్(40), ప్రియాన్ష్ ఆర్య(49), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39), రుతురాజ్ గైక్వాడ్(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్, విల్ సదర్లాండ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. లైమ్ స్కాట్ రెండు, ఓవెన్ ఓ వికెట్ సాధించారు.
అదరగొట్టిన పేసర్లు
అనంతరం 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 46.2 ఓవర్లలో 226 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌కు ఓపెనర్లు జోష్ ఫిలిప్(56), స్కాట్(26) మంచి ఆరంభం ఇచ్చినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో కంగారూ జట్టు ఓటమి పాలైంది.
భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్, నిషాంత్ సింధూ తలా వికెట్ రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్పిన్నర్లు విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్ తలా వికెట్ తీశారు.


