జ్యోతి ‘పసిడి’ పరుగు | Jyoti Yarraji retains gold medal in 100m hurdles | Sakshi
Sakshi News home page

జ్యోతి ‘పసిడి’ పరుగు

May 30 2025 2:24 AM | Updated on May 30 2025 2:26 AM

Jyoti Yarraji retains gold medal in 100m hurdles

100 మీ. హర్డిల్స్‌ స్వర్ణం నిలబెట్టుకున్న ఏపీ అథ్లెట్‌ 

స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌కు స్వర్ణం 

4x400 మీ. రిలేలో మహిళలకు బంగారం 

పురుషుల జట్టుకు రజతం 

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌ పతకాల పంట  

గుమి (దక్షిణ కొరియా): భారత క్రీడాకారులు ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండిస్తున్నారు. రెండో రోజు అర డజను (6) పతకాలు సాధించిన భారత బృందం మూడో రోజు కూడా మరో ఆరు పతకాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. పురుషుల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌ సబ్లే విజేతగా నిలువగా, 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత మహిళల బృందం స్వర్ణం సాధిస్తే... పురుషుల జట్టేమో రజతంతో సరిపెట్టుకుంది. 

మహిళల లాంగ్‌జంప్‌లో ఆన్సీ సోజన్‌ రజతం, శైలీ సింగ్‌ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా ఈ మూడు రోజుల్లోనే భారత్‌ మొత్తం 14 పతకాలతో సత్తా చాటుకుంది. తొలి రోజు రెండు పతకాలు నెగ్గిన భారత బృందం ఈ చాంపియన్‌షిప్‌లో బుధవారం పోటీలు ముగిసే సరికి పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

తెలుగు తేజం కొత్త రికార్డు 
రెండేళ్ల క్రితం బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌)లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు సరికొత్త రికార్డుతో తెలుగుతేజం స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీని 12.96 సెకన్లలో పూర్తిచేసిన ఏపీ అథ్లెట్‌ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె 1998లో కజకిస్తాన్‌ అథ్లెట్‌ ఓల్గా షిషిజినా (13.04 సె.) రికార్డును అధిగమించింది. 

ఈ టైమింగ్‌నే 2011లో చైనా క్రీడాకారిణి సున్‌ యావె (13.04 సె.) నమోదు చేసింది. 2023–బ్యాంకాక్‌ ఈవెంట్‌లో జ్యోతి (13.09 సె.) బంగారు పతకాన్ని గెలిచింది. తద్వారా ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో హర్డిల్స్‌లో స్వర్ణాలు నిలబెట్టుకున్న అరుదైన ఐదుగురు అథ్లెట్ల క్లబ్‌లో చేరింది. ఎమి అకిమొతొ (జపాన్‌; 1979, 1981, 1983), జాంగ్‌ యు (చైనా; 1991, 1993), సు యిన్‌పింగ్‌ (చైనా; 2003, 2005), సున్‌ యావె (చైనా; 2009, 2011)ల సరసన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి నిలిచింది.  

36 ఏళ్ల తర్వాత బంగారం 
భారత అథ్లెట్‌ అవినాశ్‌ సాబ్లే ఈ సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌కు 36 ఏళ్ల తర్వాత స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ పోటీని 8:20.92 సెకన్ల టైమింగ్‌తో అగ్ర స్థానంలో నిలిచాడు. గత ఏడాది భారత ఆటగాడు 8:09.91 సెకన్లతో జాతీయ రికార్డును నెలకొల్పాడు.

చివరిసారిగా భారత్‌ ఈ క్రీడాంశంలో 1989లో బంగారు పతకం గెలిచింది. దినరామ్‌ విజేతగా నిలువగా, తొలిసారిగా పసడి నెగ్గిన ఘనత హర్బల్‌ సింగ్‌ (1975లో)కు దక్కింది. మహిళల 10వేల మీటర్ల పరుగులో ‘పోడియం’కు దూరమైన సంజీవని జాదవ్‌ (33:08.17 సె.), సీమా (33:08.23 సె.) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. 

రిలేలో పతకాల జోరు 
మూడో రోజు పోటీల్లో రిలే బృందాలు సత్తా చాటుకున్నాయి. మహిళల 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ కుంజా రజిత సహా జిస్నా మాథ్యూ, రూపల్‌ చౌదరి, శుభా వెంకటేశన్‌లతో కూడిన బృందం బంగారు పతకం సాధించింది. పోటీని అందరికంటే ముందుగా భారత జట్టు 3 నిమిషాల 34.18 సెకన్లలో  పూర్తి చేసి విజేతగా నిలిచింది. పురుషుల 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో తృటిలో స్వర్ణావకాశం చేజారడంతో రజతం దక్కింది. 

జయ్‌ కుమార్, ధర్మ్‌వీర్‌ చౌదరి, మనూ తెక్కినలిల్, విశాల్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 03.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. కేవలం 0.15 సెకన్ల తేడాతో ఖతర్‌ జట్టు (3 ని.03.52 సె) బంగారు పతకం సాధించింది. మహిళల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో ఆన్సీ సోజన్‌ రజతం గెలుపొందగా, షైలీ సింగ్‌ కాంస్య పతకం నెగ్గింది. ఆన్సీ 6.33 మీటర్లు దూకి రెండో స్థానం సాధించగా, షైలీ సింగ్‌ 6.30 మీటర్లతో ఆమె వెనక నిలిచింది. ఈ ఈవెంట్‌లో ఇరాన్‌ అథ్లెట్‌ మొబిని అరని (6.40 మీ.) స్వర్ణం గెలుచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement