ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత జట్టు శుభారంభం అందుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో.. దాయాది పాకిస్తాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి చిరకాల ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి జయభేరి మోగించింది.
ఇండియా గెలుస్తుందని ముందే తెలుసు
ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ప్రశంసలు కురుస్తుండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని తనకు ముందుగానే తెలుసునని.. పాక్ కంటే భారత జట్టుకు ‘అన్‌ఫేర్’ అడ్వాంటేజ్ ఉందంటూ అక్కసు వెళ్లగక్కాడు.
ఇది అన్యాయం
భారత్- పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన నాసిర్ హుసేన్ తాజా స్కై స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘‘మ్యాచ్ ఆరంభానికి ముందే ఇండియా గెలుస్తుందని నాకు తెలుసు. ఇండియా- పాక్ మధ్య పోటీ అన్యాయం. పాక్‌తో పోలిస్తే ఇండియాకు అదనపు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
రెండూ సమతూకమైన జట్లు కావు. ఇండియా ప్లేయర్లు ఎక్కువగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్నారు. తద్వారా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నారు. ఆ అనుభవంతో జాతీయ జట్టు తరఫునా రాణిస్తున్నారు. కానీ పాకిస్తాన్‌లో ఆ పరిస్థితి లేదు.
బంగ్లా, పాక్ ప్లేయర్లు అద్భుతం.. కానీ పాపం
బంగ్లాదేశ్‌కు చెందిన మరుఫా అక్తర్, పాక్ ప్లేయర్ ఫాతిమా సనా అత్యద్భుతమైన క్రికెటర్లు. కానీ వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే అవకాశం లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోంది. ది హండ్రెడ్ వంటి లీగ్‌లలో వీరిని ఆడించాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆడిన అనుభవం ఐసీసీ ఈవెంట్లలోనూ పనికివస్తుంది’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.
అదే లాజిక్ ఇక్కడ వర్తించదా?
ఈ నేపథ్యంలో పురుషుల క్రికెట్‌లో మీ వైఖరి ఏమిటి అంటూ టీమిండియా అభిమానులు నాసిర్ హుసేన్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘భారత క్రికెటర్లు కేవలం ఐపీఎల్‌లోనే ఆడతారు.
పాక్ ఆటగాళ్లు మాత్రం PSLతో పాటు, బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్ తదితర విదేశీ లీగ్‌లలోనూ ఆడతారు. మరి వాళ్లెందుకు టీమిండియా చేతిలో ఓడిపోతున్నారు? మీ లాజిక్ ప్రకారం ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువగా ఆడే పాక్ ప్లేయర్లే పైచేయి సాధించాలి కదా!’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.


