త్వరలో ప్రారంభం కానున్న దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025-26) కోసం 15 మంది సభ్యుల జార్ఖండ్ జట్టును ఇవాళ (నవంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఎంపికయ్యాడు.
ఈ జట్టులో కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్ లాంటి ఐపీఎల్ సంచలనాలకు చోటు దక్కింది. ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్ లాంటి స్థిరమైన బ్యాటర్లు.. సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్ లాంటి నాణ్యమైన బౌలర్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరందిరినీ కలగలుపుకొని ఇషాన్ జార్ఖండ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
27 ఏళ్ల ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు మారు పేరు. చూడటానికి చిన్నగా ఉన్నా భారీ షాట్లు ఆడగల సమర్దుడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఇషాన్, టీమిండియాలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇషాన్‌కు ఇదివరకే జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది.
టీ20 ఫార్మాట్‌లో ఇషాన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 206 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్.. 134.20 స్ట్రైక్ రేట్‌తో 5270 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అనుభవమున్న ఇషాన్.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున మెరిశాడు. ఈ సిరీస్‌లో ఇషాన్ ఓ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.
నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ ఎలైట్ గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, తమిళనాడు, సౌరాష్ట్ర, త్రిపుర జట్లు ఉన్నాయి. జార్ఖండ్ నవంబర్ 26న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈసారి ఇషాన్ నేతృత్వంలోని జార్ఖండ్ జట్టు అండర్ డాగ్‌గా బరిలోకి దిగనుంది. స్టార్లతో నిండిన పటిష్టమైన జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది.
కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్ లాంటి హార్డ్ హిట్టర్లు చెలరేగవచ్చు. అనుకూల్ రాయ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటే ఆస్కారం ఉంది. ఇషాన్‌ను వ్యక్తిగతంగా ఆపడం కూడా చాలా కష్టమవచ్చు. ఇషాన్ ఒక్క సారి టచ్‌లోకి వచ్చాడంటే ఎంతటి బౌలర్లనైనా లెక్క చేయడు.
SMAT 2025-26 కోసం జార్ఖండ్ జట్టు..
ఇషాన్ కిషన్ (C/WK), ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా (WK/VC), రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్, పంకజ్ కుమార్, బాలకృష్ణ, మొహమ్మద్ కౌనైన్ ఖురేషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజన్దీప్ సింగ్.
చదవండి: IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు


