ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ అనవసర రికార్డు విషయంలో చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన కీలక మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకోవడంతో ఈ సీజన్‌లో అతను మొత్తంగా ఇచ్చిన పరుగుల సంఖ్య 541కు చేరింది. దీంతో వరుసగా మూడు ఐపీఎల్ సీజన్లలో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న అర్ష్‌దీప్‌పై పంజాబ్ కింగ్స్ ఎప్పటిలాగే భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, అతను వరుసగా మూడు సీజన్ల పాటు నిరాశపరిచాడు. వికెట్లు తీస్తున్నా పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనై వైడ్లు, నో బాల్స్‌తో విసుగు తెప్పిస్తున్నాడు. ముఖ్యంగా యార్కర్లు, బౌన్సర్లు వేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
లక్నో మ్యాచ్‌లో అయితే అతడి బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు పూర్తిగా టార్గెట్ చేశారు. ఈ మ్యాచ్‌తో అర్ష్‌దీప్ మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధికసార్లు ఒక మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు అతడు ఏడు సార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతడి తర్వాత సామ్ కర్రన్ (4), కగిసో రబాడా, మహ్మద్ షమీ, జేవియర్ బార్ట్‌లెట్ (తలో 3 సార్లు) 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు.
అర్ష్‌దీప్ పేలవ ఫామ్ ప్రస్తుతం పంజాబ్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకవేళ పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో అతడి పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.
మరోవైపు అర్షదీప్‌పై సోషల్‌మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటపై దృష్టి పెట్టాల్సిందిపోయి సోషల్‌మీడియా, స్నాప్‌చాట్ వీడియోలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడంటూ కొందరు అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల తిలక్ వర్మతో చేసిన వీడియో, అభిమానితో జరిగిన ఆన్‌లైన్ వాగ్వాదం వివాదాస్పదమయ్యాయి.
ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ చివరి బెర్త్ కోసం పంజాబ్‌తో పాటు రాజస్థాన్, కేకేఆర్ పోటీపడుతున్నాయి. నేటితో ఏ జట్టుకు బెర్త్ దక్కుతుందో తేలిపోతుంది. తొలి మూడు బెర్త్‌లు దక్కించుకున్న జట్లుగా ఆర్సీబీ, గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ ఉన్నాయి. తొలి క్వాలిఫయర్‌లో టాప్-2 జట్లు ఆర్సీబీ-గుజరాత్ తలపడనుండగా.. ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునే జట్టు అమీతుమీ తేల్చుకుంటుంది.


