IND vs ENG: ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం.. ఇంగ్లండ్‌ స్కోరెంతంటే? | IND Vs ENG 3rd ODI At Lords, Duckett 141 Bethell 91 England Huge Score, Check Out Full Score Details | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన డకెట్‌.. బెతెల్‌ సెంచరీ మిస్‌.. ఇంగ్లండ్‌ స్కోరెంతంటే?

Jul 19 2026 7:27 PM | Updated on Jul 19 2026 11:39 PM

IND vs ENG 3rd ODI Lords Duckett 141 Bethell 91 England Huge Score

PC: ECB X

టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు బెన్‌ డకెట్‌, జేకబ్‌ బెతెల్‌ నిలకడగా ఆడుతూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 181 బంతుల్లో ఏకంగా 192 పరుగులు జోడించారు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఇరుజట్ల మధ్య ఆదివారం నాటిక నిర్ణయాత్మక మూడో వన్డేకు ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదికగా మారింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

బెతెల్‌ సెంచరీ మిస్‌
కాస్త నెమ్మదిగా ఆరంభించినప్పటికీ ఇంగ్లండ్‌ ఓపెనర్లు డకెట్‌, బెతెల్‌ నెమ్మదిగా క్రీజులో పాతుకుపోయారు. ఈ ఓపెనింగ్‌ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో 93 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు బెతెల్‌.

అయితే, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 31వ ఓవర్లో తొలి బంతికే ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇవ్వడంతో బెతెల్‌ అవుటయ్యాడు. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నెమ్మదిగా ఆడుతూ 64 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డకెట్‌.. 36వ ఓవర్లో రెండో బంతికి ఫోర్‌ బాది శతక మార్కు అందుకున్నాడు. మొత్తానికి 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

డకెట్‌ భారీ శతకం
ఆ తర్వాత కూడా డకెట్‌, రూట్‌తో కలిసి జోరు కొనసాగించాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 80 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, 44వ ఓవర్లో మూడో బంతికి ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇవ్వడంతో డకెట్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 18 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 141 పరుగులు సాధించాడు.

రూట్‌, బట్లర్‌ మెరుపులు
ఇక 39 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వన్‌డౌన్‌ బ్యాటర్‌ జో రూట్‌.. 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులు రాబట్టాడు. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (14) విఫలం కాగా.. ఐదో స్థానంలో వచ్చిన జోస్‌ బట్లర్‌ టీ20 తరహాలో దంచికొట్టాడు. కేవలం 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 41 పరుగులతో రూట్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. 

రూట్‌, బట్లర్‌ కలిసి 19 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లండ్‌ కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 387 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. కాగా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. 

భారత బౌలర్లు పూర్తిగా విఫలం
నలుగురు సీమర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌, ప్రసిద్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్‌తో బరిలోకి దిగిన టీమిండియా వ్యూహం బెడిసి కొట్టింది. గుర్నూర్‌ పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకోగా.. అర్ష్‌దీప్‌ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇక ప్రసిద్‌ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రిన్స్‌ యాదవ్‌ కోటా పూర్తి చేసి 79 రన్స్‌ ఇచ్చుకుని ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన రో-కో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement