PC: ECB X
భారత్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ శతక్కొట్టాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ సెంచరీతో అలరించాడు. ఈ క్రమంలో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో డకెట్ చరిత్ర తిరగరాశాడు. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డును ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.
141 పరుగులు
లార్డ్స్ వేదికగా టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ బెన్ డకెట్ 135 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 141 పరుగులు సాధించాడు. అయితే, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇవ్వడంతో డకెట్ శతక ఇన్నింగ్స్ ముగిసిపోయింది.
లార్డ్స్‌లో ప్రపంచ రికార్డు
అయితే, ఈ భారీ శతకం ద్వారా డకెట్ లార్డ్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ‘మక్కా’లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు వివియన్ రిచర్డ్స్ పేరిట ఉండేది. ఇక మ్యాచ్ విషయానికొస్తే..
Nailed to the boundary!
A superb hundred for Ben Duckett at Lord's 💯
🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026
డకెట్ శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్ జేకబ్ బెతెల్ (91) సెంచరీ మిస్ అయ్యాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బెతెల్ అవుటయ్యాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. వన్డేల్లో వరుసగా ఆరో అర్ధ శతకం (48 బంతుల్లోనే 74 నాటౌట్) బాదాడు.
ఇంగ్లండ్ భారీ స్కోరు
కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 315కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 387 పరుగులు సాధించింది. లార్డ్స్‌లో వన్డేల్లో ఇదే హయ్యస్ట్ స్కోరు.
లార్డ్స్ మైదానంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు
👉బెన్ డకెట్ (ఇంగ్లండ్)- టీమిండియా మీద 2026లో 141 పరుగులు
👉వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్ మీద 1979 వరల్డ్‌కప్ ఫైనల్లో 138 నాటౌట్
👉డెనిస్ ఆమిస్ (ఇంగ్లండ్)- టీమిండియా మీద 1975లో 137 పరుగులు
👉మార్కస్ ట్రెస్కోతిక్ (ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద 2001లో 137 పరుగులు
👉గ్రాహమ్ గూచ్ (ఇంగ్లండ్)- ఆస్ట్రేలియా మీద 1989లో 136 పరుగులు.


