LA 2028: టీమిండియా అభిమానులకు శుభవార్త! | IOC–ICC Confirm LA 2028 Cricket Qualification Criteria, India Likely To Feature In Men’s And Women’s Events | Sakshi
Sakshi News home page

LA 2028: టీమిండియా అభిమానులకు శుభవార్త!

Jun 29 2026 4:51 PM | Updated on Jun 29 2026 5:09 PM

IOC ICC confirm LA 2028 qualification criteria India likely mens womens events

‘బ్లాక్‌ సండే’ ఎఫెక్ట్‌తో విచారంలో ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు ఓ శుభవార్త. లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌-2028లో భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది. కాగా దాదాపు శతాబ్దకాలం తర్వాత విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చేరుస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆరు జట్ల చొప్పున
ఈ క్రమంలో 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా క్రికెట్‌ రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జట్ల ఎంపిక, అర్హతకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (IOC) తాజాగా విధివిధానాలు రూపొందించినట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈవెంట్లో పురుషుల, మహిళల క్రికెట్‌ నుంచి ఆరేసి జట్లు పాల్గొంటాయి.

అర్హత ఏమిటి?
ఇందులో డిసెంబరు 31, 2026 నాటికి ఉన్న అత్యుత్తమ ర్యాంకింగ్‌ కలిగిన నాలుగు జట్లను (ఖండాల వారీగా) ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పురుషుల క్రికెట్‌లో ఇండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జట్ల అర్హత లాంఛనమే.

ఇక ఆతిథ్య అమెరికా మాత్రం ర్యాంకింగ్స్‌లో కనీసం టాప్‌-15లో ఉంటేనే అర్హత సాధిస్తుంది. మిగిలిన ఒక స్థానం కోసం.. టాప్‌-8లో ఉన్న జట్లు ఫైనల్‌ ఒలింపిక్‌ గ్లోబల్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్లో తలపడతాయి.

పురుషుల క్రికెట్‌ సంగతి ఇలా ఉంటే.. మహిళల క్రికెట్‌లో మాత్రం టీ20 ప్రపంచకప్‌-2026లో ప్రదర్శన ఆధారంగా అర్హ త సాధిస్తాయని తెలుస్తోంది. హయ్యస్ట్‌ ర్యాంకింగ్‌ ఉన్న జాతీయ ఒలింపిక్‌ కమిటీల నుంచి నాలుగు జట్లు అర్హత పొందుతాయి. 

ఆతిథ్య అమెరికా టాప్‌-15 ర్యాంకింగ్స్‌లో ఉంటేనే క్వాలిఫై అవుతుంది. ఇక మరొక్క స్థానం కోసం టాప్‌-8లో ఉన్న జట్లు ఫైనల్‌ ఒలింపిక్‌ గ్లోబల్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్లో తలపడతాయి.

బ్లాక్‌ సండే
భారత క్రికెట్‌ చరిత్రలో ఆదివారం (జూన్‌ 28, 2026) చేదు జ్ఞాపక​ంగా మిగిలిపోనుంది. పసికూన ఐర్లాండ్‌ చేతిలో టీ20 ప్రపంచకప్‌-2026 చాంపియన్‌ టీమిండియా ఘోర పరాభవం పాలైంది. రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓడి.. సిరీస్‌లో 0-2తో క్లీన్‌స్వీప్‌ అయింది. తొలిసారి ఐరిష్‌ జట్టు చేతిలో ఇంతటి ఘోర అవమానం చవిచూసింది.

మరోవైపు.. భారత మహిళల జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా గత పర్యాయంలోనూ భారత్‌ సెమీ ఫైనల్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement